jump to navigation

నేనెందుకు రాజీనామా చేయాలి: దామోదర్‌రెడ్డి మార్చి 12, 2008

Posted by Telangana Media in AndhraJyothy, Telangana news.
trackback

                    హైదరాబాద్‌, మార్చి 11 (ఆన్‌లైన్‌): “పార్టీలను మార్చే అలవాటున్న ఉప్పునూతల నేను రాజీనామా చేయాలంటూ సవాల్‌ చేయడం అర్థరహితం. నేనెందుకు రాజీనామా చేయాలి”- అని మంత్రి దామోదర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ అంశాన్ని సోనియా చేతుల్లో పెట్టామని, ఆమె ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని, రాజీనామాలు చేయబోమని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ శాసనసభాపక్ష కార్యాలయంలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు.

                    ఉప్పునూతలను ఉద్దేశించి సహచర మంత్రి ముఖేష్‌గౌడ్‌ తల్లిపాలు తాగి రొమ్ముగుద్దినట్టు వ్యవహరించడం సముచితం కాదని సలహా ఇచ్చారని, దీంతో తనకు తెలంగాణతల్లి మాత్రమే తల్లి అని, కాంగ్రెస్‌ పార్టీ తల్లి కాదని ఉప్పునూతల వ్యాఖ్యానించడాన్ని తాను తప్పుపట్టానని వివరణ ఇచ్చారు. రాజకీయంగా ఎదుగుదలను, పదవులను ఇచ్చి గౌరవించిన కన్నతల్లి వంటి కాంగ్రెస్‌కు ద్రోహం చేయవద్దని కోరేందుకే ఉప్పునూతలను రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని కోరానని అన్నారు.

                    ఈ సందర్భంగా కాసు బ్రహ్మానందరెడ్డి హయాం నుంచి ఇప్పటివరకూ వివిధ ప్రభుత్వాల్లో ఉప్పునూతల వ్యవహారశైలిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మంత్రిపదవి దక్కుతుందని ఆశ ఉన్నంతకాలం తెలంగాణ ప్రాంతంలో వైఎస్‌ అభివద్ధి కార్యక్రమాలు విస్తతంగా చేపడుతున్నారని పొగడడమే కాకుండా… బహిరంగసభల్లో ‘రాజశేఖరా.. నీపై మోజు తీరలేదురా’ అంటూ పాటలు పాడారని… ఇప్పుడు వైఎస్‌ దిగిపో అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ను దిగిపో అని చెప్పడానికి ఉప్పునూతల ఎవరని ప్రశ్నించారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌, కిష్టారెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు»

No comments yet — be the first.