jump to navigation

టి ఆర్‌ ఎస్‌ ఎంపీల రాజీనామా(Andra jyothy paper 4/3/2008) మార్చి 4, 2008

Posted by Telangana Media in Telangana Articles.
trackback

…చర్చకు ఎన్‌డి ఏ పట్టు…స్పీకర్‌ నిరాకరించడంతో వాకౌట్‌
…బిల్లు పెట్టడానికి కాంగ్రెస్‌కు అడ్డేమిటి?…నిలదీసిన అద్వానీ
…తెలంగాణ ఇస్తామని ఎప్పుడూ చెప్పలేదు: లగడపాటి,జైరాంరమేష్‌, ఉండవల్లి
…టి ఆర్‌ ఎస్‌, కాంగ్రెస్‌ తెలంగాణ ప్రజలను మోసం చేశారు: ఎర్రన్నాయుడు
…టి ఆర్‌ ఎస్‌ ఎంపీల నిష్క్రమణ తరువాత సభలో ప్రవేశించిన నరేంద్ర

న్యూఢిల్లీ,మార్చి3(ఆన్‌లైన్‌): అనుకున్న గడువుకే తెలంగాణ రాష్ట్ర సమితి(టి ఆర్‌ ఎస్‌)కి చెందిన నలుగురు ఎంపీలు సోమవారం ఉదయం లోక్‌సభలో రాజీనామాలు చేశారు. తమ రాజీనామా పత్రాలను స్పీకర్‌ సోమనాథ్‌చటర్జీ సూచనల మేరకు నిండు సభలోనే లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు సమర్పించారు. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ రాజీనామాలకు సభలో కాంగ్రెస్‌ తప్ప దాదాపు అన్ని పార్టీల సభ్యులు సానుభూతి వ్యక్తంచేయడంతో ఈ ఘట్టానికి ఎనలేని ప్రాధాన్యత లభించింది.బిజెపి ఆద్వర్యంలో మొత్తం ఎన్డీయే సభ్యులు టిఆర్‌ఎస్‌కు మద్దతుగా వాకౌట్‌ చేయగా, తెలుగుదేశం, ఆర్‌పిఐ, సిపిఐ సభ్యులు అధికార పార్టీ వైఖరిని ఎండగట్టారు. ఉదయం 11 గంటలకు ముందే గులాబీ కండువాలు« ధరించి సభలో ప్రవేశించిన టిఆర్‌ఎస్‌ సభ్యులు సభ ప్రారంభం అవుతూనే జై తెలంగాణ నినాదాలతో సభ దష్టిని ఆకర్షించారు. లోక్‌సభ స్పీకర్‌ సోమనాథ ఛటర్జీ కూడా అధికార పార్టీ సభ్యులు ప్రతిఘటిస్తున్నప్పటికీ వినకుండా టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ప్రసంగించడానికి, సభలోనే రాజీనామాలు సమర్పించడానికి అనుమతించి కొత్త చరిత్రకు నాందిపలికారు.టిఆర్‌ఎస్‌ సభ్యుల రాజీనామా ఘట్టం జరుగుతున్నప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ సభలో లేకపోగా, విదేశాంగ మంత్రి, యుపిఏ సబ్‌ కమిటీ చైర్మన్‌ ప్రణబ్‌ ముఖర్జీ నిమ్మకు నీరెత్తినట్లు మౌనంగా కూర్చుండిపోయారు. సోమవారం ఉదయం లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే టిఆర్‌ఎస్‌ సభ్యులు లేచి నిలబడడంతో ఉత్తరఖండ్‌నుంచి లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన తేజ్‌పాల్‌సింగ్‌ ప్రమాణ స్వీకారోత్సవం వరకూ ఆగాలని స్పీకర్‌ వారికి సూచించారు. అనంతరం టి ఆర్‌ ఎస్‌ ఎంపీలు స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లి తాము రాజీనామాలు చేస్తున్నామని, తమకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వాలని కోరారు.తొలుత స్పీకర్‌ ఇందుకు నిరాకరించినప్పటికీ అద్వానీ ప్రేరణ మేరకు బిజెపి లోక్‌సభ నేత విజయ్‌ కుమార్‌ మల్హోత్రా అండగా నిలబడడంతో ఆయన వారికి అనుమతి ఇచ్చారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ సమయంలో సభలో ఉన్న రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ సభ్యులు లగడపాటి రాజగోపాల్‌, కె ఎస్‌ రావు, రాయపాటి సాంబశివరావు, సాయిప్రతాప్‌ తదితరులు లేచి టి ఆర్‌ ఎస్‌ సభ్యులను మాట్లాడటానికి అవకాశం ఇవ్వకూడదని అరిచారు. కొద్దిసేపు సభ్యుల వాగ్వివాదాల తరువాత రాజీనామాలు చేస్తున్న సభ్యులు తమ తమ స్థానాలకు వెళ్లి మాట్లాడమని స్పీకర్‌ అనుమతి ఇచ్చారు.

ముందుగా కెసి ఆర్‌ మాట్లాడుతూ 2004 ఎన్నికల సమయంలో తెలంగాణను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చి తమతో పొత్తు పెట్టుకున్నదని ఆ తరువాత యుపి ఏ కనీస ఉమ్మడి ప్రణాళికలో కూడా ఈ అంశాన్ని చేర్చి రాష్ట్రపతి చేత కూడా తెలంగాణ ఏర్పాటు ఖాయమని చెప్పించారని అన్నారు. అయితే నాలుగేళ్లు అయినా అధికార కాంగ్రెస్‌ తెలంగాణ ప్రజలకు చేసిన మోసాన్ని ఖండిస్తూ తమ రాజీనామాలను సమర్పిస్తున్నామని కెసి ఆర్‌ తెలిపారు. ఆ తరువాత ఇదే విషయాన్ని ఆ పార్టీ ఎంపీలు వినోద్‌కుమార్‌, రవీంద్రనాయక్‌, మధుసూధన్‌రెడ్డిలు చెప్పి తమ రాజీనామాలను తీసుకొని స్పీకర్‌ వద్దకు వెళ్లారు. అయితే వాటిని సెక్రటరీ జనరల్‌కు ఇవ్వాలని సూచిస్తూ రాజీనామాలను ఆమోదించడానికి కొన్ని నియమాలున్నాయని వాటిని పరిశీలించిన తరువాత తగిన నిర్ణయం తీసుకుంటామని స్పీకర్‌ తెలిపారు.

జై తెలంగాణ..అంటూ నినాదాలు చేసుకుంటూ టి ఆర్‌ ఎస్‌ సభ్యులు సభనుంచి నిష్క్రమించిన తరువాత అద్వానీ లేచి మాట్లాడుతూ ఒక అంశంపై సభలో రాజీనామాలు చేయడం ఇదే బహుశా మొదటిసారి.. అయితే తెలంగాణ అంశంపై కొంత చర్చకు అనుమతి ఇస్తే బావుంటుంది..అప్పుడే అన్ని విషయాలు బయటకు వస్తాయి..అని అన్నారు. అందుకు స్పీకర్‌ నిరాకరిస్తూ రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే సమయంలో కావాలంటే తెలంగాణ అంశాన్ని ప్రస్తావించవచ్చని ప్రత్యేకంగా దీనిపై అనుమతించేది లేదని స్పష్టం చేశారు. అందుకు నిరసనగా అద్వానీతో పాటు ఎన్‌డి ఏకు చెందిన పార్టీల సభ్యులంతా వాకౌట్‌ చేశారు.

ఎన్‌డి ఏ సభ్యులంతా వాకౌట్‌ చేస్తున్న సమయంలో లగడపాటి రాజగోపాల్‌ లేచి తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్‌ ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మొదటినుంచి రెండో ఎస్సార్సీనే డిమాండ్‌ చేస్తున్నదని అందుకు టి ఆర్‌ ఎస్‌ కూడా అంగీకరించిందని అన్నారు. 1998లో ఒక ఓటు–రెండు రాష్ట్రాలు అంటూ తీర్మానం చేసిన బిజెపి ఆరేళ్లు అధికారంలో ఉన్నప్పుడు మూడు చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేసినా తెలంగాణ అంశాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. రెండో ఎస్సార్సీని అంగీకరిస్తూ టి ఆర్‌ ఎస్‌ ఎంపీ నరేంద్ర సంతకం చేసిన నోట్‌ను కూడా రాజగోపాల్‌ సభ్యులందరికీ పంచిపెట్టారు.

కాగా టి ఆర్‌ ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు రెండూ తెలంగాణ ప్రజలను మోసం చేశారని తెలుగుదేశం పార్లమెంటరీపార్టీ నేత ఎర్రన్నాయుడు ఆరోపించారు. ఎర్రన్నాయుడు పదే పదే అడ్డుపడుతుండటంతో స్పీకర్‌ కొద్దిగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అద్వానీతో ఉండవల్లి ఢీ కాగా సాయంత్రం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటప్పుడు కూడా అద్వానీ తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు. అప్పుడు ఆయనకు కాంగ్రెస్‌ ఎంపీలు జైరాం రమేష్‌, ఉండవల్లి అరుణ్‌కుమార్‌లు అడ్డుపడ్డారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్‌ మోసం చేసిందని అద్వానీ అన్నారు.

యుపి ఏ కనీస ఉమ్మడి ప్రణాళికలో పేర్కొనడమే కాకుండా రాష్ట్రపతి చేత కూడా చెప్పించిన కాంగ్రెస్‌కు తెలంగాణ బిల్లును తీసుకురావడానికి అడ్డు ఏమిటో చెప్పాలని నిలదీశారు. బిల్లు తెస్తే బిజెపి కూడా మద్దతునిస్తుందని హామీ ఇచ్చిన తరువాత కూడా కాంగ్రెస్‌ మీనమేషాలను లెక్కపెడుతున్నదని, దీన్ని మోసమని కాక ఏమంటారని అద్వానీ ప్రశ్నించారు. అద్వానీ ప్రసంగాన్ని మొదట అడ్డుకున్న జైరాం రమేష్‌ తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్‌ ఎప్పుడూ చెప్పలేదని కావాలంటే రికార్డులను పరిశీలించుకోవచ్చని అన్నారు.

ఉండవల్లి అరుణ్‌కుమార్‌ కూడా లేచి మోసం చేసింది కాంగ్రెస్‌ కాదు..బిజెపియే మోసం చేసింది…కాకినాడలో ఒక ఓటు రెండు రాష్ట్రాలని తీర్మానం చేసి అధికారంలోకి రాగానే ఆ విషయాన్ని మర్చిపోయారు..అని అన్నారు. బిజెపి సభ్యుడు అనంత్‌కుమార్‌ మాట్లాడుతూ ఎన్‌డి ఏ హయాంలో మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసిన విషయాన్ని కాంగ్రెస్‌ సభ్యులు మర్చిపోతున్నారని, ఇప్పుడు తెలంగాణ బిల్లు పెడితే మద్దతునిస్తామని తాము స్పష్టం చేసిన తరువాత కూడా కాంగ్రెస్‌ ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ది ఉంటే బిల్లు పెట్టాలని డిమాండ్‌ చేశారు. అద్వానీతో ఉండవల్లి, జైరాం రమేశ్‌ వాగ్వివాదానికి దిగుతున్నప్పుడు మాత్రం సభలో సోనియా, మన్మోహన్‌లిద్దరూ ఉన్నారు.

కొసమెరుపు
టి ఆర్‌ ఎస్‌ ఎంపీలు నలుగురు రాజీనామాలు చేసి బయటకు వెళ్లిన కొద్ది సేపటికి, వారు వెళ్లిన ద్వారం గుండానే ఆపార్టీనుంచి బహిష్కరణకు గురైన మరో ఎంపీ నరేంద్ర సభలోకి రావడం కొసమెరుపు.

టిఆర్‌ ఎస్‌ సభ్యులు రాజీనామా పత్రాలు ఇచ్చి వెళ్తున్నప్పుడు ఇది చాలా దురదృష్టకరం..సభలో సభ్యుల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతున్నది అంటూ స్పీకర్‌ సోమనాథ్‌చటర్జీ వ్యాఖ్యానించారు. సభనుంచి వెళ్తున్న టి ఆర్‌ ఎస్‌ ఎంపీల వైపు ఎన్‌డి ఏ, సిపి ఐ, ఆర్‌పిఐకి చెందిన కొద్దిమంది సభ్యులు విజయచిహ్నాలను చూపి వారిని ఉత్తేజపరిచేందుకు ప్రయత్నించారు. ద్వారం వద్దకు వెళ్లిన తరువాత కెసి ఆర్‌తో సహా నలుగురు నిలబడి స్పీకర్‌ వైపు తిరిగి చూసి జై జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. మళ్లీ వస్తాం.. తెలంగాణ తీసుకొని వెళ్తాం అంటూ నినాదాలు చేసుకుంటూ సభనుంచి నిష్క్రమించారు.

ప్రకటనలు

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: