jump to navigation

దారి తప్పించే ప్రయత్నం మార్చి 5, 2008

Posted by Telangana Media in Telangana Articles.
trackback

– బోధనం నర్సిరెడ్డి, ఎలికట్టె శంకర్‌రావు, గౌస్‌ మొహియుద్దీన్‌

‘దారి తప్పుతున్నాం జాగ్రత్త’ అంటూ తెలంగాణా ప్రజలతో మమేకమైనట్టు ఎం.వి.రమణారెడ్డి రాసిన ఉపన్యాస వ్యాసం (ఫిబ్రవరి -వివిధ) ఉత్త వైరుధ్యాలపుట్టగానూ, కోస్తా పక్షపాతంగానూ ఉంది. తిరుపతిలో ఈ ఉపన్యాసం ఎంత దురుద్దేశ్యపూర్వకంగా, పక్షపాత ధోరణితో చేసిందో పత్రికలో రావడం ద్వారా తెలంగాణా ప్రజలకు తెలిసింది. ఇందులోని వైరుధ్యాలను, పక్షపాత వ్యాఖ్యానాలను ఒక్కటొక్కటే సోదాహరణంగా వివరిస్తాం.

1) తిరుపతిలో తెలుగుతల్లి రథోత్సవం జరిపించిన తమ్ముళ్ళను అభినందించడంలోనే ఆయన ఎటువైపో తేలిపోయింది. రాష్ట్రాలు వేరైనాక రాష్ట్ర చిహ్నాలు వేరైనట్టు’రాష్ట్రమాత’ కూడా వేరౌతుంది. ఇందులో అసహజమేముంది? దేశానికి భారతమాత’ ఉండగా రాష్ట్రానికి తెలుగుతల్లి ఉండడం ఇన్నాళ్ళు అనవసరం అనిపించలేదు కదా.

2) ‘సమాజాన్ని కదిలించే ఏ ప్రకంపనైనా సాహిత్యాన్ని తాకుతుంది’అన్నారు నిజమే. తెలంగాణా ప్రజలను కదిలించిన రాజకీయ ఉద్యమం సాహిత్యాన్ని కూడా తాకింది. కదిలించింది. అందుకు దాఖలాయే తెలంగాణా మాండలికంలో వస్తున్న కథలు, కవిత్వం.

3) ‘నా ప్రాంతంలో వాడే మాండలికాన్ని నేను రాస్తాను. నా యాసలోనే నేను రాస్తాను. ఇంకొకరి భాష నేనెందుకు రాయాలి? అనే పరిస్థితి వచ్చేసింది. ఇంకొకరి భాష అంటే కోస్తా వాళ్ళ భాష అనే అర్థంలో ‘ప్రామాణికమైన భాషను కోస్తా భాష కింద జమకట్టి దాన్ని తొలగించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి’ అంటూ తనకు తానే ప్రశ్నలు వేసుకుని జవాబులు రాసుకున్నారు. ఇవ్వాళ తెలంగాణా మాండలికం రాసే కవులు గాని, రచయితలు గాని, ఎవరూ కూడా ‘ఇంకొకరి భాష ఎందుకు రాయాలి’ అని అనుకోవడంలేదు. మా భాష, మాకు తెలిసిన భాష, మేం మాట్లాడే భాష మాత్రమే రాస్తామని రాస్తున్నారు. ‘ప్రామాణిక తెలుగు భాష’ అని మనమనుకునే తెలుగు భాషకీ, కోస్తా భాషకీ ఉన్న సామ్యాలు, వ్యత్యాసాలు ఏ పాటివో రమణారెడ్డి గారికి తెలియవనుకోము.

4) సినిమాభాష ప్రస్తావనలో తెలంగాణా, రాయలసీమ భాషలు పొందుతున్న అవమానాన్ని ఒక్కటి చేశారు. దీనితో మాకేమీ పేచీ లేదు. కాకపోతే రాయలసీమ భాషను మాత్రమే కించపరుస్తున్నారని వివరంగా స్పష్టపర్చారు. తెలంగాణా భాష పొందుతున్న అవమానం విషయంలో అంత శ్రద్ధ చూపలేదు.

5) ‘ఇంతవరకూ ఉపయోగిస్తూ వచ్చిన ప్రామాణిక భాషను ఇది నా భాష అంటూ ఎవడో కోస్తావాడు వచ్చి దొమ్మీగా లాక్కుపోతూ ఉంటే చూసి ఊరుకోవడానికి నేను సిద్ధంగా లేను’ అన్నారు. ఇది వ్యాసకర్త లేదా ఉపన్యాసకర్త అవగాహనకు నిదర్శనం. ఎందుకంటే ఏ భాషకు ప్రచారం పొందే అవకాశం వస్తుందో అదే ప్రామాణిక భాష అయి కూర్చుంటుంది. కోస్తా భాష విషయంలో అదే జరిగింది. ప్రామాణిక భాషగా చలామణి పొందుతున్న కోస్తాంధ్ర భాషను కాపాడుకుందామన్నారు. దీన్ని కాపాడుకోవటానికి కూడా ఈయన దగ్గర గొప్ప సాధనాలేమీ ఉన్నట్టు చెప్పలేదు.

రాయలసీమ, తెలంగాణా గ్రామాల్లో వాడే పదాలను తీసుకొచ్చి ప్రామాణిక భాషలో చేరేట్టు చూడండి’ అన్నారు. నిజానికి పదాలను తీసుకొచ్చి భాషలో చేర్చరు. భాషలో చేరిన పదాలను మాత్రమే మనం చూస్తాం. అందుకు ఏ ప్రాంతంలోనైనా ప్రజలు మాట్లాడే సజీవ భాషలో సాహిత్య సృజన జరగాలి. అంతే. ఇప్పుడు మనం వాడిదొద్దు, వీడిదొద్దు అనుకోవడంలేదు. వాడిదీ, వీడిదీ, మనదీ, అందరిదీ ఎవడిది వాడే రాసుకోవాలి అనుకుంటున్నాం.

6) ‘మాండలిక పదాలు కాదు మాండలిక యాస మాత్రమే’ అన్నారు. నిజానికి రెండింటికీ ఉన్న తేడా ఏమిటి? పదాలు కాని, యాస గానీ పరిచయం ఉంటేనేగా తెలిసేది. ఆ పరిచయం కోసమే మాండలికంలో సాహిత్య సృజన జరగాలి. ఇది చేతనైంది పులికంటి కృష్ణారెడ్డి వంటి ముగ్గురు నలుగురు రచయితలకే అన్నారు. మరి మిగతా ముగ్గురు ఎవరు? అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, తెలిదేవర భానుమూర్తి వంటి వాళ్ళా? లేక రావి శాస్త్రి, పతంజలి, నామిని వంటి వాళ్ళా?

7) ప్రామాణిక భాషలో రాసి మాండలికంలోకి తర్జుమా చేస్తున్నారన్నారు. నిజానికి ఇవ్వాళ మాండలికంలో రాసే రచయితలెవ్వరూ ఆపని చెయ్యడంలేదు. అది సాధ్యపడదుకూడా. కావాలంటే మాండలికం నుంచి ప్రామాణికంలోకి తర్జుమా చేసుకోవచ్చు. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి కూడా.

8) మాండలిక భాషలో రాయడంవల్ల పాఠకుల సంఖ్య తగ్గుతుందన్నారు. కాని అట్ల జరగదు. మాండలికభాష పాఠకుల్లో జిజ్ఞాసను పెంచుతుంది. ఎందుకంటే పాఠకులు కేవలం కథ కోసమే చదవరు. ఇతరేతర భాషా అంశాలను, జీవితాన్ని కూడా తెలుసుకోవాలనుకుంటారు.

9) ‘బ్రిటన్‌లో ఇంగ్లీషంతా ఒకలాగా ఉంటుందని మనం అనుకుంటాం’ అన్నారు. అందులో 43 రకాల ఉచ్చారణలు ఉన్నాయని అన్నారు. నిజానికి ఈ రెండూ అబద్ధాలే. ఎందుకంటే బ్రిటన్‌ ఇంగ్లీషంతా ఒకేలాగా ఉంటుందని అనుకునేటంత అజ్ఞానంలో ఇవాళ ఎవరూలేరు. భాష సజీవమైనది. ఉచ్చారణ ఇవ్వాళ 43 రకాలుంటే ఎల్లకాలం అన్నీ ఉండవు. పెరుగుతూనో, తగ్గుతూనో ఉంటాయి.

10) ‘ప్రామాణిక భాష కోస్తాదా? రాయలసీమదా? తెలంగాణాదా? లేక మరొకటా? అని తేలడానికి అసలు తెలుగుభాష బతికుంటే కదా’? అని ఆవేదన వెలిబుచ్చారు. దీనితో మాకు పేచీ ఏమీలేదు. ఇవ్వాళ అన్ని భారతీయ భాషలు కూడా ఆంగ్లం మోజులో పడి అణగారిపోతున్నాయే తప్ప మాండలికాల వల్ల కాదు. రమణారెడ్డి గారి భాషా శాస్త్ర పరిజ్ఞానాన్ని నగ్నంగా బయటపెట్టే మరో అంశం.

ఇవ్వాళ చెప్పే వ్యాకరణాన్ని గురించి ప్రస్తావిస్తూ తత్సమమంటే సంస్క­ృత సమమని, తద్భవమంటే సంస్క­ృతం నుండి పుట్టినదని మాత్రమే చెప్తున్నారన్నారు. కాని ఆంగ్ల, ఉర్దూ, హిందీ’సమాలను, భవాలను’ గురించి కూడా ఉపాధ్యాయులు చెప్తున్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని భాషోపాధ్యాయులు ఇతర రాష్ట్ర భాషా భవాలను, సమాలను గురించి కూడా చెప్తున్నారు. కాకపోతే అవన్నీ విద్యార్థులకు పరీక్షాంశాలు కావు. నిజానికి పాఠశాలలు, కళాశాలల్లో సిలబస్‌ కూడా మారాలి. ప్రజా పాఠ్యాంశాలు రాకుండా అడ్డుపడేది కూడా కోస్తాంధ్ర పాలకులు, రచయితలే. తెలంగాణను వ్యతిరేకించే రాజకీయనాయకుల భావాలకు ఏమాత్రం తీసిపోనివిగా రమణారెడ్డిగారి భావాలున్నాయి. ఇది తెలంగాణ సంస్క­ృతిని దొంగదెబ్బకొట్టే ప్రయత్నంలో భాగమే.

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: