jump to navigation

కలిసుందాం రండి… మార్చి 12, 2008

Posted by Telangana Media in Eenadu, Telangana news.
trackback

కలిసుందాం రండి…

 

11pan3a.jpg

కాంగ్రెస్‌ గెలుపుతోనే మన మనుగడ

తెలంగాణ ఎంపీలకు వైఎస్‌ పిలుపు
జైపాల్‌రెడ్డి విందులో ఉల్లాసంగా ముఖ్యమంత్రి
తెలంగాణకే కట్టుబడ్డా: కాకా
ఆంధ్రనేతలు మాటలాపాలి: వీహెచ్‌
న్యూఢిల్లీ – న్యూస్‌టుడే
మధుయాష్కీతో ఆలింగనం…
కాకాతో ఆత్మీయ కరచాలనం…
జైపాల్‌రెడ్డి, వీహెచ్‌లతో ప్రేమపూర్వక పలకరింపులు…
ఇతర కాంగ్రెస్‌ ఎంపీలతో సరదా సరదా కబుర్లు…
అంతా ఒక్కటిగా ఉందామని సున్నిత సందేశం…

 

ఇవన్నీ చేసింది ఎవరో కాదు… ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డే. ముఖ్యమంత్రి కొత్త తీరు చూసి ఎంపీలు అంతా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ముఖ్యంగా తెలంగాణ ఎంపీలయితే ఈ నిజాన్ని కొద్దిసేపు నమ్మలేకపోయారు. వివిధ అంశాలపై తనను విమర్శించే వారితో కూడా వైఎస్‌ ఇంత చనువుగా వ్యవహరించారేమిటా అనుకున్నారు. ఈ సన్నివేశం చోటు చేసుకుంది ఢిల్లీలో అయితే… ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డి తన నివాసంలో ఇచ్చిన విందు కార్యక్రమం దీనికి వేదికయ్యింది. ఏటా రాష్ట్రానికి చెందిన ఎంపీలకు జైపాల్‌రెడ్డి విందు ఇవ్వడం గత నాలుగేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. మంగళవారం ఇచ్చిన మధ్యాహ్నవిందుకు.. ఢిల్లీలోనే ఉన్న వైఎస్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంత ఎంపీల చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని… ‘కాంగ్రెస్‌ పార్టీ విజయాలు సాధిస్తూ దేదీప్యమానంగా ఉంటేనే మనమంతా మనగులుతాం. వచ్చే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపొందడానికి మీ అందరి సహకారం కావాలి. కలిసి పోరాడదాం’ అని అన్నారు. విందులో సహజంగానే ‘తెలంగాణ’ అంశం ప్రస్తావనకు వచ్చింది. జైపాల్‌రెడ్డి, వెంకటస్వామి, వీహెచ్‌, దాసరి నారాయణరావు, కె.కేశవరావు, జి.ఎస్‌.రావు(పీసీసీ అధ్యక్షుడు), రేణుకాచౌదరి, వి.బాలశౌరి, సురవరం సుధాకరరెడ్డి (సీపీఐ), టి.సుబ్బరామిరెడ్డిలు ముఖ్యమంత్రి కూర్చున్న రౌండ్‌ టేబుల్‌ చుట్టూ కూర్చున్నారు. మిగతా ఎంపీలు మధ్య మధ్యలో అక్కడికి వస్తూ పోతూ ఉన్నారు.

ముందుగా ముఖ్యమంత్రి…’రాష్ట్రానికి నేను చేసినంత అభివృద్ధి మరే ముఖ్యమంత్రయినా చేశారా?’ అని బాలశౌరిని ప్రశ్నించి చర్చకు నాంది పలికారు. అభివృద్ధికి సలహాలు ఇవ్వాలని, కొత్త ఆలోచనలు పంచుకోవాలని కూడా జైపాల్‌రెడ్డి, ఇతరులను వైఎస్‌ కోరారు. ఈ సందర్భంగా వీహెచ్‌ జోక్యం చేసుకుని వచ్చే ఉప ఎన్నికల గురించి మాట్లాడదాం అన్నారు. ‘తెలంగాణలో ఉప ఎన్నికలకు మంత్రులను ఇన్‌ఛార్జులుగా నియమించే ముందు మమ్మల్ని ఎందుకు సంప్రదించలేదు’ అని వీహెచ్‌ ప్రశ్నించారు. బదులుగా ముఖ్యమంత్రి… ప్రస్తుతం మీ అందరి సలహాలు, ఆలోచనలు చెప్పాలనే కోరుతున్నానని అన్నారు. తెలంగాణకు సంబంధించి నా చేతిలో ఏమీలేదని, అంతా అధిష్ఠానం చేతిలోనే ఉందని పునరుద్ఘాటించారు. ‘వ్యక్తిగతంగా ఎంపీలు గానీ, నాయకులు గానీ వారి ఇష్టం వచ్చినట్లు తెలంగాణపై మాట్లాడవద్దు. అది పార్టీ ప్రయోజనాలను దెబ్బతీస్తుంది’ అని వైఎస్‌ హితవు పలికారు.

వెంకటస్వామి మాట్లాడుతూ… సోనియాగాంధీ అపాయింట్‌మెంట్‌ కోసం ఐదురోజులు ఎదురు చూడటం తనను ఎంతగానో బాధించిందన్నారు. ఫలితం దక్కకుండానే వెనక్కి తిరిగిరావాల్సి వచ్చిందని చెప్పారు. ‘ఏ సమయంలోనైనా జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీలను కలుసుకునే వాడిని. అలాంటిది నా కూతురు వయసున్న సోనియా నాకు అపాయింట్‌మెంట్‌ తిరస్కరించడం బాధ కలిగించింది’ అని వివరించారు. తానే అడ్డుకున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయని, అయితే అపాయింట్‌మెంట్‌ దొరక్కపోవడానికి తాను బాధ్యుణ్ని కాదని కాకా చేతులు పట్టుకుని ముఖ్యమంత్రి చెప్పినట్టు తెలిసింది. బహుశా అనారోగ్యం కారణంగా ఆమె అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోయుంటారని అన్నారు. అనంతరం చర్చ మళ్లీ తెలంగాణపై కొనసాగింది. తాను తెలంగాణకు కట్టుబడి ఉన్నానని వెంకటస్వామి విస్పష్టంగా చెప్పారు. ప్రత్యేక తెలంగాణను ప్రకటిస్తే… తెలంగాణ ప్రాంతంలోని అన్ని సీట్లూ కాంగ్రెస్‌ కైవశం చేసుకుంటుందన్నారు. కొందరు ఎంపీలు జోక్యం చేసుకుని… ‘ఇదివరకు మీరు ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తారు. ఇప్పుడు మీ వైఖరిని మార్చుకున్నారేమిటి’ అని ప్రశ్నించారు. చేవెళ్ల ప్రాజెక్టు, ఇతర అభివృద్ధి అంశాలపై వైఎస్‌ను కొనియాడానని, ఇప్పటికీ ఆయనపై వ్యతిరేకత ఏమీ లేదన్నారు. ఈ వయసులో… తెలంగాణ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేదేలేదని కాకా స్పష్టం చేశారు.

ఇదే సమయంలో రాయపాటి సాంబశివరావు ఏదో అనడంతో వీహెచ్‌ తీవ్రంగా స్పందించారు. ’41 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తెలంగాణ అంశంపై ఢిల్లీకి వచ్చినప్పుడే ఆంధ్రా నాయకులు అభ్యంతరం చెప్పాల్సింది. ఇప్పుడు వ్యవహారం చాలా దూరం వెళ్లింది. ఆంధ్రా నాయకులు తెలంగాణపై అసంబద్ధంగా మాట్లాడుతున్నారు. ఆ మాటలే తెలంగాణపై ఒత్తిడి, సానుభూతి పెంచుతున్నాయి. ముందు ఆంధ్రా నేతలు తెలంగాణపై మాట్లాడటం ఆపేయాలి’ అని వీహెచ్‌ అన్నారు. ఇంతలో రేణుకాచౌదరి కల్పించుకుని… ఇంతవరకు పార్టీ జెండా పట్టనివారు కూడా తెలంగాణపై మాట్లాడుతున్నారని ఆమె మధుయాష్కీని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ‘కాకా, హనుమంతరావులు మాట్లాడారంటే అర్థం ఉంది. పార్టీ జెండాను భుజనా మోసిన కార్యకర్తలకు మనం ఎంతో రుణపడి ఉండాలి. కాంగ్రెస్‌ను సమాధి చేయొద్దు. సీనియర్‌ నేతలు కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలతో సందిగ్థత సృష్టించకూడదు’ అని విజ్ఞప్తి చేశారు.

విందు చర్చల్లో జైపాల్‌రెడ్డి దాదాపు మౌనంగానే ఉండిపోయారు. విందు తర్వాత ఆయనే ఈ విషయాన్ని విలేకరులకు చెప్పారు. తెలంగాణపై తన అభిప్రాయాన్ని బహిరంగంగా ప్రకటించనని, పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌లకు మాత్రమే చెబుతానని అన్నారు.

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: