jump to navigation

మెడలు కోసుకుంటాం మార్చి 12, 2008

Posted by Telangana Media in Eenadu, Telangana news.
trackback

మెడలు కోసుకుంటాం
రాజీలేని పోరు చేస్తాం
తెలంగాణ ఇస్తరో, ఇయ్యరో సీదా చెప్పుండ్రి
కాంగ్రెస్‌ నేతలకు కేసీఆర్‌ సవాల్‌
హైదరాబాద్‌ – న్యూస్‌టుడే

 

11pan13a.jpg

”ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం దిశగా అంతిమపోరాటం ఆసన్నమైంది. ప్రజలు, విద్యావంతులు, ఉద్యోగుల దీవెనలు మాకున్నాయి. తెలంగాణ కోసం ప్రజాస్వామ్య పద్ధతుల్లో రాజీలేని పోరాటం చేస్తున్నం. ఇందుకోసం మెడలు కోసుకుంటాం తప్ప మెడలు వంచం.

 

        ప్రాణాలర్పించేందుకూ సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ ప్రాంత ప్రజలు స్వేచ్ఛగా జీవించాలంటే రాజకీయ అధికారం కావాలి. అధికారం ఆంధ్రా ప్రాంతం వారికిచ్చి దరఖాస్తులు పట్టుకుని యాచించుడు వద్దు. మనమే శాసించాలి.. డిమాండ్‌ చేయాలి. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీలో వణుకు పుట్టింది. వచ్చే ఎన్నికల్లో 119మంది ఎన్నికల్లో గెలిస్తే సుందరయ్య విజ్ఞానకేంద్రానికి వచ్చి కాళ్లుమొక్కి తెలంగాణను అప్పగిస్తరు. ఇప్పటి నుంచి తెలంగాణ సాధన కోసం గల్లీ గల్లీకి వెళతాం. ప్రతి గుండె తలుపును తడతాం” అని తెరాస అధినేత కేసీఆర్‌ పేర్కొన్నారు.

సుందరయ్య కళానిలయంలో తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సంఘీభావ సభలో కేసీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2004 ఎన్నికల్లో తెలంగాణ ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్‌ పార్టీ దగాకోరుతనాన్ని బయటపెట్టేందుకే చట్టసభలకురాజీనామా చేశామని ఆయన తెలిపారు. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ నేతలు వేసుకున్న గులాబి కండువా వారి మెడల్లో నాగుపాముగా మారిందని చెప్పారు. నిజానికి కాంగ్రెస్‌తో పొత్తు తనకేమాత్రం ఇష్టం లేదన్నారు. పరిగి, నల్గొండ, వనపర్తిలలో జరిగిన బహిరంగ సభల్లో కాంగ్రెస్‌ నాయకులు ‘తెలంగాణ రాష్ట్రం కావాలంటే కేసీఆర్‌ మాతో పొత్తు పెట్టుకోవాలి… లేదంటే ఆయన్ను చంద్రబాబు ఏజెంట్‌గా పరిగణిస్తాం అని అన్నారు. దీంతో పార్టీ నాయకులు, ప్రజల నుంచి వచ్చిన విపరీత ఒత్తిడి కారణంగా పొత్తు కుదుర్చుకున్నాం. కాంగ్రెస్‌పై నమ్మకం లేకపోయినా అప్పటికి తప్పని పరిస్థితుల్లో ఒప్పుకున్నాం. ఏరుదాటక తెప్పతగలేసిన చందంగా మోసం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం వారికి ఇష్టం లేనందునే అష్టవంకరులు తిప్పుతున్నారు. ఒక్కో నాయకుడు ఒక్కో మాట మాట్లాడుతున్నాడు’ అని విమర్శించారు.”అరె… తెలంగాణ ఇస్తరా? ఇయ్యరా? సీదా చెప్పుండ్రి… మా తొవ్వ మేం చూసుకుంటం” అంటూ సవాల్‌ విసిరారు.

కాంగ్రెస్‌ నేతలూ… మాటలొచ్చిన చిలుకలా చస్తారు: తెలంగాణ రాష్ట్రంపై ప్రేమ ఉన్నా అధికారం మత్తులో రాజశేఖర్‌రెడ్డిజిత్తులతో కూరుకుపోయిన కాంగ్రెస్‌ నేతలు మాటలొచ్చినా సమయానికి మాట్లాడలేక చనిపోయిన చిలుకమల్లే చస్తారని కేసీఆర్‌ హెచ్చరించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ దివాలకోరుతనంతో కొందరు కాంగ్రెస్‌ నేతలు అధికారంలో ఉన్నవారికి మడుగులొత్తుతున్నారని ఆరోపించారు.

పరాభవం తప్పదు: మొల్ల చేతిలో పరాభవం పొందిన తెనాలి రామలింగడిలా కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ ప్రజల నుంచి అవమానం తప్పదని కేసీఆర్‌ అన్నారు. కవయిత్రి మొల్లను ఓడించేందుకు వెళ్లిన తెనాలి రామలింగడు పరిచారికను ‘దరిద్రపు దానా సున్నం తీసుకురా… అంటూ ఆశువుగా పద్యం చెప్తాడు. అందుకామె లోపలికి వెళ్లి కుక్కా సున్నం తీసుకో అంటూ పద్యం ద్వారానే దీటుగా సమాధానం చెప్తుంది. ఇది పిట్టకత కాదు… నిజంగా జరిగింది. పరిచారికలా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధిచెపుతారు’ అంటూ సభికులను నవ్వించారు.

కీర్తి సంపాదించుకుంటారా? లేదా?.. జయశంకర్‌: రాష్ట్రాన్ని ఇచ్చి కీర్తి సంపాదించుకుంటారో అడ్డుకాలు వేసి అపకీర్తిని మూటగట్టుకుంటారో కాంగ్రెస్‌ తేల్చుకోవాలని తెరాస సిద్ధాంతకర్త జయశంకర్‌ ప్రశ్నించారు. వాస్తవాలు పరిగణించకుండా కాంగ్రెస్‌ నేతలకు అవాకులు చెవాకులు పేలుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామన్న ముఖ్యమంత్రి వైఎస్‌.. గోదావరి, కృష్ణా జలాల్లో ఎన్ని నీళ్లు ఈ ప్రాంతానికి ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మరోమారు వైఎస్‌ ముఖ్యమంత్రి ఐతే తెలంగాణ ప్రాంతాన్ని అణిచేస్తారని, రెండో శ్రేణి ప్రజలుగా మనం జీవించాల్సి వస్తుందని పేర్కొన్నారు.

ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో రాజీనామా చేసిన తెరాస ఎంపీలు మధుసూదన్‌ రెడ్డి, వినోద్‌కుమార్‌, రవీంద్ర నాయక్‌, ఎమ్మెల్యేలు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, డాక్టర్‌ విజయరామారావు, డాక్టర్‌ నగేష్‌, సోలిపేట రామలింగారెడ్డి, ఎ.రవీందర్‌ రెడ్డి, డాక్టర్‌ చంద్రశేఖర్‌, గోవింద నాయక్‌, ఎమ్మెల్సీలు కె.దిలీప్‌కుమార్‌, హెచ్‌.ఎ.రహమాన్‌, తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: