jump to navigation

తెలంగాణకు అధిష్ఠానమే అడ్డు! మార్చి 15, 2008

Posted by Telangana Media in Eenadu, Telangana news.
trackback

వైఎస్‌ దేముంది
ఉంటే రాజ్‌భవన్‌లో ఉండేవాడిని
కేవీపీ నాకు ద్రోహం చేశారు
ఉప ఎన్నికల్లో పోటీ చేయకుంటే మంచిది
అధిష్ఠానం ఏమంత బలంగా లేదు: ఎమ్మెస్‌
హైదరాబాద్‌ – న్యూస్‌టుడేకాంగ్రెస్‌ సీనియర్‌ నేత

        ఎం.సత్యనారాయణరావు మరోసారి సంచలనం సృష్టించారు. ప్రత్యేక తెలంగాణకు కాంగ్రెస్‌ అధిష్ఠానమే అడ్డని ప్రకటించారు. ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి మనోభావాలతో సంబంధం లేకుండా… అధిష్ఠానం ఇవ్వదల్చుకుంటే తెలంగాణను ఇచ్చేయొచ్చని అన్నారు. ముఖ్యమంత్రి సన్నిహితుడు కేవీపీ తనకు ద్రోహం చేశారని వ్యాఖ్యానించారు. వైఎస్‌కు తానిచ్చినంతటి మద్దతును ఎవరూ ఇవ్వలేదని, దీనికోసం తాను ఇతర కాంగ్రెస్‌ సీనియర్ల నుంచి ఇబ్బందులెదుర్కొన్నానని ఆవేదన చెందారు. శాసనసభ లాబీల్లో ఎమ్మెస్‌ విలేకరులతో మాట్లాడారు. విలేకరుల ప్రశ్నలు… ఎమ్మెస్‌ స్పందనలూ…

తెలంగాణపై కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?
               జరిగేదేముంది? ప్రధాని మన్మోహన్‌ ఎప్పుడో చెప్పారు… ముఖ్యమంత్రి వైఎస్‌ అంగీకరించటం లేదని! బలమైన ముఖ్యమంత్రిని కాదని తెలంగాణ ఎలా ఇస్తారు?

అంటే ముఖ్యమంత్రే అడ్డుగా ఉన్నారా?
            ఆయన తెలంగాణకు అంగీకరించకపోవటం అలా ఉంచండి. కాంగ్రెస్‌ అధిష్ఠానం ఇవ్వదల్చుకున్న పక్షంలో వై.ఎస్‌. ఆపలేక పోవచ్చు. తల్చుకుంటే వెంటనే రాష్ట్రాన్ని ఇచ్చేయవచ్చు.

అధిష్ఠానానికే తెలంగాణ ఇష్టం లేదనా?
              మీరు కూడా ఢిల్లీ కోణంలో ఆలోచించండి. ఇప్పుడు యూపీఏ ప్రభుత్వంలో ఒక్క కాంగ్రెస్‌ మాటే చెల్లుబాటు అవుతున్నదా? అది నానాజాతులున్న కూటమి. అందరూ కలసివస్తేనే ఉమ్మడి నిర్ణయం చేస్తారు.

రాష్ట్ర విభజన జరిగితే సీట్లురావా?
            ఇప్పుడున్న ఫలితాలు పునరావృతం కావేమోనన్న అనుమానాలున్నాయి. పార్టీ అన్నాక అన్నీ ఆలోచన చేయాలి కదా! సోనియా స్థానంలో ఎవరున్నా ఇలాగే ఆలోచిస్తారు.

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పరిస్థితేంటి? 
                అవి తెరాస సీట్లు. మేం కలసి పోటీచేశాం. ఇప్పుడు వారి సీట్లకు వారి రాజీనామాల కారణంగానే ఉప ఎన్నికలొస్తున్నాయి. ఆ సీట్లలో కాంగ్రెస్‌ పార్టీ పోటీ పెట్టకుండా ఉండటం సమంజసం. ఇది నా అభిప్రాయం. దీన్ని కొందరు మంత్రులకు చెప్పా. అవసరమైతే పార్టీకి చెపుతా. నన్నడిగిన పక్షంలో ముఖ్యమంత్రికీ చెపుతా.

కాంగ్రెస్‌ పోటీచేస్తే…?
               చేస్తేఏమవుతుంది? కరీంనగర్‌లో ఏం జరిగిందో తెల్సుగా! అభివృద్ధి ఎంత చేసినా సెంటిమెంటుముందు నిలబడదు. అలాగని మేం తెరాసకు పనిచేయం. కాంగ్రెస్‌ కోసమే పనిచేస్తాం. పార్టీకి ద్రోహం చేసే ప్రశ్నేలేదు.

సీనియర్‌గా మీరు సూచించవచ్చుగా!
       ఇంకెక్కడి సీనియారిటీ. దాన్నే గుర్తిస్తే ఈ పాటికి రాజ్‌భవన్‌లో ఉండేవాడిని.

తెలంగాణపై పార్టీ నిర్ణయాన్ని వై.ఎస్‌ ప్రభావితం చేస్తున్నారా?
                 ఆయన సంగతెలా ఉన్నా.. పార్టీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. చేయదల్చుకుంటే పార్టీ చేయగలదు. వైఎస్‌నెందుకు అంటారు? ఆయనకు అంత బలమే ఉంటే ఆయన సన్నిహితుడు కేవీపీ రామచంద్రరావుకు రాజ్యసభ సభ్యత్వం తెచ్చుకునేవాడు కదా! పాపం! రెండ్రోజుల్నుంచీ కేవీపీకి ఒకటే టెన్షన్‌. టిక్కెట్టు వస్తుందో రాదోనని! ఏం చెప్పమంటారు! నా హయాం(2002)లో ఆయనకు రావాల్సింది టి.సుబ్బరామిరెడ్డికి దక్కింది. నేను బాధపడ్డాను కూడా! వాస్తవానికి కేవీపీ నాకు చాలా ద్రోహం చేశారు. నాకు అప్రధానమైన దేవాదాయ శాఖ రావటానికి ఆయనే కారణం. నేను వైఎస్‌కు ఎంత చేశాను? రాష్ట్రంలో సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలంతా ఆయన్ను వ్యతిరేకిస్తుంటే.. కాదని ఆయన్ను కాబోయే ముఖ్యమంత్రిగా నేనే ప్రకటించాను. కానీ ఇప్పుడు నాకు జరిగిందేమిటి? నాకు ద్రోహం చేసినప్పటికీ కేవీపీకి టిక్కెట్టు రావాలనే కోరుకుంటా. ఆయనకు ఎందుకింత అన్యాయం చేస్తున్నారో అర్థం కాదు. మూడు సార్లుగా ఆయనకు టిక్కెట్టు రావటం లేదు. ఆయన మహామంత్రి తిమ్మరుసు లాంటివాడు. తిమ్మరుసు కూడా అంతే. అందర్నీ చావగొట్టాడు. అయినా, నాకు ఆయనపై సానుభూతి ఉంది.

తెలంగాణపై పార్టీ ఏం చేయబోతోంది?
                  ఇప్పుడున్న బలం మళ్లీ తెచ్చుకోగలమా? అన్నదే పార్టీకున్న ఆలోచన. పార్టీ పరిస్థితి ఇప్పుడెలా ఉందంటే… కోడికంటే గుడ్డుతో సర్దుకుందామన్నట్టుగా ఉంది. ఎప్పుడో తినే కోడికూర కంటే ఇప్పుడున్న గుడ్డును తినేసి సరిపెట్టుకుందామన్న ఆలోచనతో నాయకత్వం ఉంది.

సోనియా పరిస్థితేంటి?
                   ఆమెకూడా తెలంగాణ విషయంలో ఏం చేయగలదు పాపం! ఓ విధంగా ఆమె బలహీనురాలు. కాంగ్రెస్‌ అధిష్ఠానం నెహ్రూ కాలంలా బలంగాలేదు. కాంగ్రెస్‌ బలహీనత కారణంగానే భాజపా పుంజుకుంటోంది. లేకుంటే రెండు సీట్లున్న భాజపా.. అధికారానికి రావటమేమిటి? కాంగ్రెస్‌ బలహీనంగా ఉన్నప్పటికీ పార్టీకి సోనియానే దిక్కు. రాజీవ్‌ తర్వాత పీవీ, కేసరిలువచ్చినా ఏమైంది? మళ్లీ ఆవిడ వస్తే కానీ పార్టీ పుంజుకోలేదు.

 

ప్రకటనలు

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: