jump to navigation

తెలంగాణ బంద్‌ సంపూర్ణం మార్చి 15, 2008

Posted by Telangana Media in Eenadu, Telangana news.
trackback

జిల్లాల్లో విజయవంతం
రాజధానిలో పాక్షికం
సచివాలయ ముట్టడికి యత్నం
అగ్రనేతల అరెస్టు
రాష్ట్రవ్యాప్తంగా 8వేల మంది అదుపులోకి

14pan3a.jpg

 

 

                భాజపా చేపట్టిన తెలంగాణ బంద్‌ స్వల్ప ఉద్రిక్త సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణపై కాంగ్రెస్‌, సోనియాగాంధీల వైఖరిని నిరసిస్తూ.. సోనియా రాష్ట్ర పర్యటనకు వ్యతిరేకంగా భాజపా ఈ బంద్‌కు పిలుపునిచ్చింది. రాజధానిలో బంద్‌ ప్రభావం పాక్షికంగా కనిపించింది. కరీంనగర్‌, వరంగల్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ తదితర జిల్లాలన్నింటిలోను బంద్‌ విజయవంతమైంది. హైదరాబాద్‌, వరంగల్‌ తదితర చోట్ల భాజపా కార్యకర్తలు బస్సు అద్దాలను పగలగొట్టారు. రాజధానిలో రాష్ట్ర మంత్రులు నలుగురిని భాజపా కార్యకర్తలు ఘోరావ్‌ చేశారు. సచివాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దత్తాత్రేయ, లక్ష్మణ్‌ తదితరులను పోలీసులు ప్రతిఘటించారు. ఈ సందర్భంగా పోలీసులు మహిళలపై కూడా బలప్రయోగం చేశారు. బంద్‌ సందర్భంగా మొత్తం తెలంగాణ జిల్లాల్లో 8,385 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి, అనంతరం వదిలేశారు. దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి, లక్ష్మణ్‌, చింతల రామచంద్రారెడ్డి, రాజేశ్వరరావు, ఝాన్సీరాణి, ప్రతాప్‌, సుగుణాకర్‌రావు, యాదగిరిరెడ్డి, నర్సింహారావు, బద్దం బాల్‌రెడ్డి, కళ్లెం బాల్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు తదితర నేతల్ని తెలంగాణ వ్యాప్తంగా వివిధ చోట్ల అరెస్టుచేశారు.

                ఉదయం నుంచే డిపోల్లో బంద్‌: బంద్‌ సందర్భంగా భాజపా కార్యకర్తలు బస్‌ డిపోల్లో ఆందోళనకు దిగి బస్సులను ఆపేశారు. హైదరాబాద్‌తోపాటు అన్నిజిల్లాల్లోనూ పార్టీశ్రేణులు జట్లుగా విడిపోయి బస్‌ డిపోలు, వ్యాపార సముదాయాలను మూసేయించే కార్యక్రమం చేపట్టారు. విద్యాసంస్థలు సెలవు ప్రకటించాయి. మరోవైపు దేవాదుల ప్రాజెక్టును ప్రారంభించేందుకు వచ్చే సోనియాకు.. నిరసన తెలిపేందుకు వెళ్లిన భాజపా నేతలను అరెస్టుచేసి ములుగు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

         వేల సంఖ్యలో అరెస్టులు: బంద్‌ సందర్భంగా జిల్లాల్లో వేల సంఖ్యలో కార్యకర్తలను అరెస్టు చేశారు. ఒక్క వరంగల్‌లోనే 4,200 మంది, గ్రేటర్‌ హైదరాబాద్‌లో 2,460 మంది అరెస్టయ్యారు. నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌లలో కూడా వందల సంఖ్యలో కార్యకర్తలను అరెస్టు చేశారు. ఉస్మానియా, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో సంపూర్ణంగా బంద్‌ జరిగింది. తెరాస ఈ బంద్‌కు దూరంగా ఉంది. తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి, తెలంగాణ రచయితల సంఘం, తెలంగాణ విద్యార్థి సంఘం, తెలంగాణ ప్రైవేటు కళాశాలల సంఘం, గెజిటెడ్‌ అధికారుల సంఘం తదితర సంఘాలు మద్దతు పలికి బంద్‌లో పాల్గొన్నాయి.

          సెంటిమెంటును చూపించారు…దత్తాత్రేయ: ప్రజలు సోనియాగాంధీ పర్యటనను అసలు పట్టించుకోలేదని, తెలంగాణ సెంటిమెంటును, ఆత్మాభిమానాన్ని ప్రదర్శిస్తూ బంద్‌ను విజయవంతం చేశారని దత్తాత్రేయ పేర్కొన్నారు. బంద్‌ అనంతరం పార్టీ నేతలు విద్యాసాగర్‌రావు, ఇంద్రసేనారెడ్డి, రామచంద్రరావులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజల భావాల్ని అర్థం చేసుకుని సోనియా, వైఎస్‌లు ఇప్పటికైనా కళ్లు తెరవాలని ఉద్ఘాటించారు. జగ్గంపేట సభలాగే హైదరాబాద్‌లోనూ సభ పెట్టి ఉంటే సెంటిమెంట్‌ షాక్‌ను సోనియా స్వయంగా చూసి ఉండేవారని పేర్కొన్నారు.

               నగరంలో మిశ్రమ స్పందన: భాజపా చేపట్టిన తెలంగాణ బంద్‌కు నగరంలో మిశ్రమ స్పందన లభించింది. తెల్లవారుజామున 4 గంటలకే రోడ్లపైకి వచ్చిన భాజపా నాయకులు, కార్యకర్తలు పలు ఆర్టీసీ డిపోల్లో బస్సులు బయటికి రాకుండా అడ్డుకున్నారు. ఆందోళనకారులు 28 బస్సుల అద్దాలు పగలగొట్టగా… 60 వరకు బస్సుల టైర్లలో గాలి తీశారు. భాజపా నేత ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు దిల్‌సుఖ్‌నగర్‌ బస్సు డిపో ముందు బైఠాయించారు. పలు కూడళ్లలో సోనియాగాంధీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. వరంగల్‌లో బంద్‌ సంపూర్ణంగా జరిగింది. భాజపాతోపాటు, మావోయిస్టులు, జనశక్తి వేర్వేరుగా బంద్‌కు పిలుపునిచ్చాయి. వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు మూసివేశారు. వరంగల్‌, హన్మకొండ పరిధిలో అక్కడక్కడా ఆర్టీసీ బస్సు అద్దాలు పగలుగొట్టిన ఘటనలు మినహా అంతా ప్రశాంతంగా ముగిసింది. కరీంనగర్‌ జిల్లాలో బంద్‌ ప్రశాంతంగా జరిగింది. మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్సులు నడవలేదు. మెదక్‌ జిల్లాలో బంద్‌ సంపూర్ణంగా జరిగింది. సిద్దిపేటలో ఆందోళనకారులు నాలుగు ఆర్టీసీ బస్సు అద్దాలను పగులగొట్టారు.

               కిషన్‌రెడ్డి ధర్నా.. అరెస్టు, విడుదల: తెలంగాణపై కాంగ్రెస్‌ వైఖరిని   నిరసిస్తూ భాజపా శాసనసభా పక్ష నేత జి.కిషన్‌రెడ్డి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని జై తెలంగాణ.. జైజై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కిషన్‌రెడ్డిని అరెస్టు చేసి, అనంతరం విడుదల చేశారు.

– న్యూస్‌టుడే యంత్రాంగం

 

 

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: