jump to navigation

కూలిన గులాబీ తోట మార్చి 29, 2008

Posted by Telangana Media in AndhraJyothy, Pranahita.
trackback

– అల్లం నారాయణ

ఏటా కోటీ ఇరవైలక్షల మంది నీ గులాబీతోటను తొక్కుకుంటూ తోసుకుంటూ ఎగిరిపోతారిక లోహవిహంగాల రెక్కలపైన. నీ ఎకరం గులాబీ తోట పక్కవాళ్ళ వందలాది ఎకరాల చేనుచెలక, ఆ పక్కవాళ్ళ కూరగాయల మళ్ళను మాయం చేసి నాలుగున్నర కిలోమీటర్ల పెట్టున వేసినారు చూడు… అది రన్‌వే. అతి పొడవైనది. అదొక కొండచిలువకూడా. దానికడుపులో దాగున్న నీ గులాబీతోట, వేల ఎకరాల తోటలు వాడిపోయినయ్‌. ఆవుల చంద్రమ్మా, సుభద్ర, రాజవ్వ, మల్లవ్వ, రాజపోషవ్వ పేరేదైతేనేం భూమి పుత్రికా. ఎవరో ఒకరు ఎగిరిపోవడానికి నేలమీద వేళ్ళూనుకున్న మీలాంటి లక్షలాదిమంది నేలబంధం తెగిపోవడం ఎవరికి మాత్రం ఎందుకు పడుతుంది లక్ష్మక్కా! తలకిందులుగా చూసినప్పుడు కదా… కొంచెమైనా అసలు సత్యం బోధపడేది.

ఎవరికుందంటావ్‌ అంత ఓపికా, తీరికా… ఊపిరి సలపని అభివృద్ధిలో ఆగమైన బతుకుల మూల్గులు ఎవరు వింటారు? పల్లె మూలుగలను పీల్చే నల్లని తారురోడ్డు స్వప్నం ముందు.. నీ కలలు ఎలా నిలబడతాయి చంద్రమ్మా, ఇస్మాయిల్‌ ఖాన్‌కా బీబీరసూలమ్మ… అంతా ఒక పాముచుట్టుకుంటున్నట్టు…దివారాత్రులు మళ్ళు తీసి..నీరుపెట్టి, ఆకుతుంచి అలం ఏరి, మళ్ళు చేసి,దళ్ళు వేసి పూయించిన గులాబీ తోటను గురించి కానీ, రెక్కలు మొలిచిన శంషా బాధలో నీ నోటికాడి ముద్దజారిపడి, రెక్కలు కూలు తున్న చప్పుడు కానీ ఎవరైనా వింటారా? ఎ-380 శబ్దం… అదట్లా రెక్కలల్లారు స్తూ, నేలకు దిగుతున్నప్పుడు గుండెల మీదుగా బుల్డోజర్లు దొర్లుతున్న చప్పుడు ముందు నీ అన్నార్తుల కేకలు అరణ్య రోదనలే కదా! అభివృద్ధి అంటే ‘హై’దరా బాద్‌ అంటే బుల్డోజింగ్‌ కూడా కదా!

ఏదీ ధ్వంసం కాకుండా ఏదీ నిర్మించడం కుద రదు కదా! నువ్వూ నీతోపాటు పదూళ్ళ జనం, నీ గులాబీతోట, దోసకాయమడి, టమాటాపంట, కొత్తిమీర, ఉల్లినార, పుదీనా తోటలతో పాటు మనుషుల కాళ్ళూ రెక్కలు, కపా లాలు, కంకాళాలు తొక్కుకుంటూ విరుచుకుపడి కూలగొడ్తు న్న బుల్డోజింగ్‌ కదా అభివృద్ధి అంటే. అభివృద్ధి పదఘట్టన ల్లో బొక్కలు ఫెళ్ళున, ఫెటిల్లున విరుగుతున్న చప్పుడు. అమా యకపు పుడమితల్లీ ఆవుల చంద్రమ్మా…నీ గురించి, నీతోపాటు అభివృద్ధి కింద నలిగి నీలిగిన వాళ్ళ గురించి ఎందుకు? ఎవరు మాత్రం మాట్లాడతారు. ఎవరు మాత్రం ఒక క్షణం రెప్పపాటు గా ఆలోచించాలి. హైటెక్‌ సిటీకింద, ఆవులమందల అసలు మాదాపూర్‌, ఫిల్మ్‌సిటీ కింద ఆ కొసనుంచి ఈ కొసదాకా వాగులు, వంకలు, చెరువు లు,దొరువులు నగరం చుట్టూ అభివృద్ధి ముకుతాడుగా చుట్టుకున్న కొండచిలువ రింగురోడ్డు ఎందరిని నిర్వాసితులను చేసిందో? ఎవరికి చెప్పుకోగలం?

మీరు వేలకు అమ్ముకుంటే వారు కోట్లకు అమ్ముకుని కొల్లగొట్టిన దానిపేరే కదా అభివృద్ధి? రియల్‌ మాయ. అయినా మట్టిని నమ్ముకున్న వాళ్ళు మీరు. చేతికి మట్టి అంటకుండా మట్టినీ, మనసునూ అమ్మే బేహా రులు వాళ్ళు. కొంత తనదీ, కొంత మందిదీ (షేర్‌ మార్కెట్‌) కొంతెందుకు అంతా సర్కారువారు ధారవోసింది. అంతా కలిసి లెక్కిస్తే ఆకాశంలో గిర్రున విమానాలు ఎగరేసే వేలకోట్లు. నీలా… నీలాంటి మరికొందరిలా రోజూ రెక్కలుముక్కలు చేసు కునే శ్రమజీవుల్లా… డొక్కలు మాడ్చుకుని, సున్నితమైన గులా బీలు పూయించి అమ్ముకోవడమెందుకు? అభివృద్ధి చాలా సులభం. ఆ అభివృద్ధి గురించి నీకు తెలీదు కదా! గాలిలో నోట్ల రెపరెపలు. షేర్‌ బజార్లో షేర్‌ వాటాలు. బ్యాంకుల్లో అప్పులు. గాలిలో కోటానుకోట్ల సంపద. అందుకేనమ్మా.. ఆవుల చంద్రమ్మా… ఏం పనిచేయగలరు మీరు.

రెండు రెక్కలు తప్ప మరి లేనివాళ్ళు. చెమట ఒడవడం తప్ప రానివాళ్ళు. గొడ్లుకాసుకుని బతికేవాళ్ళు. కొండొకచో గొడ్లలాంటి జీవితం కలవాళ్ళు. ఈ సుందరమైన… సువిశాలమైన.. అతి పొడ వైన..అద్దాల గాలి మోటార్ల అడ్డాలో పాయఖాన్లు కడుగు తారా! పాచి ఊడుస్తారా? ఏం చెయ్యగలరు మీరు? ఇక ఉద్యో గాలు అంటారా! ఏమివ్వగలరు? కభి అల్విద నా కెహనా! బేగంపేట, రసూల్‌పురా, సనత్‌ నగర్‌, మోతీనగర్‌, జెకే కాలనీ పేరు ఏదైతేనేం! అర్థరాత్రి గుండెలమీదుగా వెళ్లే ఆ శబ్దాలిక వినిపించవు. బహుశా ఆ కిలోమీటర్‌ పొడవూ రాహదారికి ఇరువైపులా విస్తరించిన బేగంపేటకు వెళ్ళేదారి మూగవోతుంది. ఆ రోడ్డు వెంట మనీ ఛేంజర్స్‌, కిరాయికార్లు, ఆటోలు నడిపేవాళ్లు, టికెట్‌ బుకింగ్‌ చేసేవాళ్లు, ఊడ్చి, తూడ్చి బేగంపేట ఎయిర్‌పోర్టు అద్దాల మేడలా మెరిపించినవాళ్లు… వీడ్కోలు… మిత్రులారా ఇన్నాళ్లు మీ తలల మీదుగా ఎగురుతూ దూసుకుపోయే గాలిమోటర్ల చప్పుడిక దూరమైపోయింది.

శబ్దానికి సెలవు. గాలిలో తేలిపోయే ఆ అందీ అందని చందమామ గాలిమోటర్‌ మీ పిల్లల గోరుముద్దల ఆశ ఇంకెంతమాత్రం కాబోదు. బతుకు ఇగిరిపోయింది, ఎగిరిపోయింది. చిలుకలో ప్రాణం ఎగిరిపోయినట్టు హఠాత్తుగా బేగం పేట చుట్టుపక్కల బతుకూ నిశ్శబ్దం గా ఎగిరిపోయింది. కారు నడిపినవాడా… ఆటో తోలినవాడా… బతుకం తా ఆశనిరాశల లాంటి శబ్ద నిశ్శబ్దాల మధ్య గడిపినవాడా.. సలీమ్‌! నీ బతుకిక కూలిపోయింది. నిజాం కోడలు బేగంపేటలో బతుకు పునాదిరాయి వేస్తే.. ఇందిరాగాంధీ కోడలు ఆ బతుకుసమాధిని శంషాబాద్‌లో పేరుస్తున్నది. అయినా నిర్వాసితులు ఒక్కరా! ఇద్దరా! గోదావరిఖని రాజపోశవ్వా… బెల్లంపల్లి ఊరును ముంచిన ఓపెన్‌ కాస్ట్‌ గనిలో నలిగిన రాజయ్యా! సత్యవీడు, కాకినాడా, హైదరాబాద్‌లో మామిడిపల్లి ఏదో ఒక ‘గూడ’ అంతటా ఒకటే కథ.

ఎల్లంపల్లిలో మునుగుతున్న కోటిలింగాల, పోలవరంలో మునుగుతున్న కోయల దేవుడు, ఊర్ల కు ఊర్లు పెకిలించే అభివృద్ధి ముందు, దాని బుల్డోజర్‌ స్వభా వం ముందు మోకరిల్లి మూల్గుతున్న చంద్రమ్మా… తలకిందులుగా చూస్తే తప్ప నీ కూలిపోయిన గులాబీతోట జీవం ఏమి టో? దాని ప్రాణం ఏమిటో అర్థం కాదు. కభి అల్విద నా కెహనా… చంద్రమ్మా సుడులు తిరుగుతున్న నీ దుఃఖమూ… భూమిపుత్రుల శోక మూ ఒక్కటే… అది మంది శోకం. మంద మంటలైనప్పుడు.. అదొక ఉప్పెన కూడా.. ముంచెత్తే ఉప్పని కన్నీటి ఉప్పెన…

ప్రకటనలు

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: