jump to navigation

తాజా మృత్యుగీతం మార్చి 29, 2008

Posted by Telangana Media in AndhraJyothy, Pranahita.
trackback

– అల్లం నారాయణ

ఫ్రెష్‌.. రిలయన్స్‌ ఫ్రెష్‌..కాదు.. ఇప్పుడు రైతులను తవ్వి తలబోసుకుంటున్న మాజీ ఏలికగారి హెరిటేజ్‌ ఫ్రెష్‌ కూడా కాదు. నెత్తిన ఫ్రెష్‌గా తలపాగాతో, కంకాళాల మీద కూచొని తాజాగా రైతు ప్రవచనాలు వల్లిస్తున్న ‘మెస్సయ్య’ గురించీ నేను మాట్లాడడం లేదు. తాజా గా మరణించిన నాగలి మోసిన క్రీస్తురైతు గురించి చెబుతు న్నా. 60వేల కోట్ల రుణాల మాఫీకి ముందే బంధవిముక్తుడైన ఒక కరీంనగర్‌ రైతు ‘ఫ్రెష్‌డెత్‌’ గురించిన వారెంట్‌ ఇది. బహుశా ఇప్పటికిప్పుడు.. ఒకరు రాజీనామా చేస్తే మరొకరికి ‘డెత్‌వారెంట్‌’ అవుతుందన్న విషయమూ మాట్లాడడం లేదు. 60 వేల కోట్ల రుణాల మాఫీ తాజా ఆత్మహత్యలనెందు కు ఆపలేదన్నది జవాబులేని ప్రశ్న కూడా కాదు. అతను పత్తి పండించనప్పుడు పత్తి ధరలు వెలుగులు చిమ్మింది. అతను మిర్చితో విసిగిపోయినప్పుడు మిర్చి ధర ‘రెడ్‌’ మార్క్‌ దాటింది.

 

వరిధాన్యం గుత్తులు గుత్తులుగా, కంకు లుకంకులుగా భాసిల్లుతున్నప్పుడు మార్కెట్‌లో ధరకూ, షావుకారు అప్పుకింద జమకట్టుకున్న ధరకూ మధ్య ఒక పూడ్చరాని అగడ్త మిగిలింది. ఏం చెయ్యమంటావ్‌ చావక.. సేద్యం ఒక జీవితం. పొద్దున మొదలైతే నిద్దురరాత్రి దాకా సాగే యజ్ఞం. రెక్కలు ముక్కలయినప్పుడు..ఖాళీ గిన్నెలు..గింజలేని గుమ్ములు..నోటీసులు..నోటీసులుగా విస్తరించి న అప్పులు. అవమానాల, ఛీత్కారాల, అమ్మా ఆలి శీలశంకల కారుకూతల వడ్డీ వ్యాపారి భూతం. పోనీ ఏం చేయమంటారో చెప్పండి. ఒక స్వామినాథన్‌, ఒక జయతీఘోష్‌, ఒక చిదం బరం, ఒక మన్మోహన్‌సింగ్‌, ఒక మాంటెక్‌ సింగ్‌ అహ్లూవాలియా. కృత్రిమ తలపాగా చుట్టుకుని పత్రికల బ్యానర్లు కొనుక్కొని పళ్ళికిలిస్తున్న ఒక ‘పెద్దాయన’… అవును ఒక పి.వి.నరసిం హారావు కదా ఆద్యుడు. అవును కదా… ప్రపంచమంతా తొమ్మిదోనెంబరు సూచీ దాటి అభివృద్ధివేపు పరుగెడ్తున్నప్పుడు వ్యవసాయం కునారి ల్లి రెండు సూచీ దగ్గర కుప్పకూలబడి మూల్గుతున్న సంగతి లో అసలు మర్మం దాగున్నది.

పంటపొలాల్లో చెమటానెత్తు రూ కలికలిచేసుకొని కూడా… బురదబుక్కి బురదతాగి మట్టి లో మట్టిగా మారిన పంటపొలాల్లో రైతుల గురించి మాట్లాడమంటే మీరు అయిదేండ్లకోసారి అదనుమీద పదునుగా కోసుకునే ఓట్లుకాసే పంటపొలాల గురించి మాట్లాడుతుం టారు. అసలు మర్మం ఇది కదా! సంస్కరణలు కదా మొదటికి మోసం తెచ్చింది. గొప్పగా చంకలు గుద్దుకున్న ఈ మన్మోహన్‌లూ, మాంటెక్‌సింగ్‌లూ, ప్రపంచబ్యాంకు తైనాతీలకు ప్రతినిధులుగా ఉన్న అన్ని రకా ల ఏలికలూ కదా ఈ మోసపూరిత కపట ప్రణాళికలు తెచ్చిం ది. నూటికి డెబ్భైమందికి పూటకింత ముద్దపెట్టే వ్యవసాయ సమాజాన్ని, సంక్షోభంలో నిత్యం చావురేఖలమీద కదలాడే… నిత్యం సర్కస్‌ తీగలమీద సాములు చేసే వ్యవసాయ సమాజాన్ని నెలలు నిండకముందే అగ్రదేశాల బాణీలకు అడుగులు కలిపే నాట్యకత్తెను చేసింది. ఎరువులేవి దేవరా! సబ్సిడీలేవి? ఎప్పుడు ఎత్తేశారు. విత్తనాలేవి దేవరా? ఏ బహుళజాతి మోన్‌శాంటోలు మింగాయి.

పురుగుల మందు డబ్బా ఎప్పుడు చావును మోగించే మృత్యుపేటిక అయింది. ఎక్కడ ఇరుక్కున్నాడు రైతు? చివరకు కోతమిషన్‌, దున్నే యంత్రం.. యంత్రభూతముల కోరలు తోమిన మిడిమేళపు కోండ్రెడు వ్యవసాయం. ఏలికలరా! సంస్కరణ ప్రగతి పథాన అంకెలు అంకెలుగా, కోట్లు కోట్లుగా విస్తరించిన అవధూతలా రా! ఎక్కడ చిక్కుపడిపోయింది నాగేటిచాలు. జనుము వేసి.. తొక్కి… పెసరవేసి.. మినుమువేసి… పంటమార్చి… ఏమా ర్చి… కోండ్రెడు దున్నుకొని కడుపు కొఠీర నింపుకున్న రైతు ఏడపోయాడు. నాకొక రుణమివ్వండి…బాంచెన్‌ కాల్మొక్తా. లేదా నాకొక ఉరితాడివ్వండి. రుణం దొరకలేదా! ఛలో… ఉన్నాడు కదా షావుకారి. వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ.. మేక తోకకు మేక తోకకు… అంతూదరీ లేని యాతన… ఆత్మగౌరవంతో నూ, భూమిని రెండుగా చీల్చి బువ్వపంచిపెట్టిన తలబిరుసు పొగరుతోనూ… తంగెళ్ళు పీకి.. అదను చూసి…చదును చేసి.. నల్లబంగారు నేలల పచ్చటి మొక్కల సృజన చేసిన సజీవ క్రియాశీలి.. సృజనశీలి. తెగువతోనూ, ఏపుగా పెరిగిన మొక్కలా… సూర్యునికేసి నిటారుగా నిలబడిన మొఖంగల ధీరోదాత్త రైతు.

ఒక్క మాటకు కుంగిపొయ్యి, దీనుడై, హీనుడై, ప్రైవేటు అప్పు అతని చావుకొచ్చింది. లెక్కలు తెమలని, జమాకూడిక కలవని సరిహద్దురేఖలయి…అవమానం… ఆక్రోశం… ఏం చెయ్యమంటారు. చావులెక్కల్లోనూ మతల బుంది. చచ్చేది వేలల్లో…చూపేది వందల్లో… ఏం చెయ్యమంటారు రైతును. పొయిలో పిల్లి లేవలేదా? పర్వాలేదు. కానీ పంట చేతికి రాలేదు. ఊరు రాజీవ్‌ పనిపథకానికి ఎలబారింది. పత్తిచేలోనే ఇగిలిస్తున్నది. వరిధాన్యం ముదిరి జలజలా కన్నీళ్ళై రాలుతున్నది. ఎవరు చేస్తా రీపని? ఆకలికి అందనిది, పోకడకు పొందనిది. ఎక్కడ చిక్కుపడ్డావు తండ్రీ… ఈ డబ్బు జలతారు పరదాల ప్రపం చంలో. మాఫ్‌..బారాఖూన్‌ మాఫ్‌…. నిన్న పచ్చని పంటపొలమైంది.

నేడు మహమ్మారి సెజ్‌ అయింది. ఏడువందల స్థానంలో ఉన్నవాడు నేడు మూడోస్థానం లోకి ఎగబాకాడు. కూరగాయలు టోకున కొని ‘ఫ్రెష్‌’గా చిల్లరలో అమ్మేవాడు కొఠీర్లునింపుకున్నాడు. రైతు రాజ్యం గురించి ఏలికా…మాజీ ఏలికా ఇద్దరూ కలవరిస్తున్నారు. ఆ ఇద్దరు విచిత్ర సోదరుల ఆస్తి ఒక బడ్జెట్‌ పొడుగంత విస్తరించింది. ఉక్కుపరిశ్రమలో కాకలు తీరినవాడు లక్ష్మీ పుత్రుడయ్యాడు. భారత్‌ వెలిగిపోతున్నది. వాజపేయి హయాంలో వెలిగిపోయింది. ఇప్పుడు మరింత వెలిగిపోతోంది. శంషాబాద్‌కు రహదారి వేసి మరీ విమానాలు దింపి…మరీ దోచుకోమంటున్నది.

కూరగాయలు పండించలేనివాడు ఎకరాపదిలక్షలకు అమ్ముకుంటే, దళారిగాడొకడు దాన్ని పదికోట్లకు అమ్ముకుని ఫోర్బ్స్‌జాబితాలో నాలుగోస్థానంలో నిలిచాడు. జీవీకేలూ, జీఎమ్‌ఆర్‌ ప్రాపర్టీలూ… ఎంత గర్వకారణం తెలుగుజాతికి. పొగడరా….నీ తల్లి… తెలుగు భారతిని. కానీ మిత్రులారా! ఫ్రెష్‌… తాజాగా మరో శవం. అది బలవన్మరణం. బహుశా ఏ సమాజంలో నూ ఉండదు. వానల్లు కురిశాయి. ప్రాజెక్టులు తళతళలాడాయి. పంటలు పండాయి. అంతా సుభిక్షంగా ఉంది. ఒక్క రైతు ఆత్మహత్య తప్ప. అదీ 60వేల కోట్ల రుణాలమాఫీ తర్వాత ఆ రైతుకు రుణం తీరిపోయింది. బహుశా అదీ… అసలు విషాదం. జై భారత్‌, జై హింద్‌, జై ఆంధ్ర, జై తెలంగాణ…. ఇంకా ఇంకా… అదొక్కటే సశేషం.

ప్రకటనలు

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: