jump to navigation

ఎవ్రీబడీ క్రైస్‌… మార్చి 29, 2008

Posted by Telangana Media in AndhraJyothy, Pranahita.
trackback

– అల్లం నారాయణ

తలుపు తోసుకుని మృత్యువు అనాగరికంగా, అమెరికాలాగా వస్తుందని ఊహించి ఉండమేమో కదా! కిరణ్‌ దుఃఖం మా కుటుంబాన్ని వదలడం సాధ్యమా! పనిలో సరే! పదిమందిలో సరే! భ్రాంతిలో ఏకాంతంలో జ్ఞాపకాలు జ్ఞాపకాలుగా, శకలాలు శకలాలుగా అంతూ దరీలేని శోకం వెన్నాడి ఉండడం మేమెప్పుడూ ఎరగం. సాదాసీదా మనుషులం. యవ్వన ప్రాభవాల్లో తెలిసిన మృత్యువుతో సయ్యాటలాడిన వాళ్లం. తెలిసిన శత్రువుతో యుద్ధాలు చేసిన వాళ్లం. చెట్లకు కట్టిన తరువాత కూడా కరుడుగట్టిన రాజ్యానికి కరుణ కలుగుతుంది. ఇది స్వదేశీ మృత్యు రహస్యం అని తెలుసుకోగలిగిన అనుభవం పొందిన వాళ్లం. ఎల్లలెరగని సరిహద్దుల్లో జ్ఞాత, అజ్ఞాత బతుకుపొరల్లో తృటిలో, కనుమెరుపు చాటున బతికి బట్టకట్టిన మామూలు మనుషులం.

పల్లెటూరి వాళ్లం.. పట్నం ఐమూలల్లో ఒదిగి ఒదిగీ, నిలబడీ, కలెబడీ నిటారుగా మా కాళ్లమీద, ఈనేలమీద ఊని నిలుచున్నవాళ్లం. ఇట్లా ఒక ఊరూపేరూలేని, చిరునామాలేని, రూపం, సారంలేని, అదృశ్య మృత్యువికటాట్ట హాసానికి కన్నపేగు బంధాన్ని బలిపెట్టుకుంటామని ఊహించి ఉండని ఒక దిగ్భ్రాంతి. ఆశనిపాతం, అచేతనం, చేష్టలు దక్కి నిలుచున్నాం ప్రపంచం ముందు నిష్చేష్టులుగా దుఃఖభారం తోడుగా.. కిరణ్‌ అంటే ఏమిటి? మా అన్నా వదినలకు ఒక్క కొడుకేనా? బేటన్‌రోగ్‌లో వాడి ఉనికి ఉంది. లూ సియానా యూనివర్సిటీ ల్యాబ్‌ లో వాడి ప్రతిభ వెల్లడికాకుండా దాగి వుంది. విసిరేసినట్టుగా ఐమూలగా ఉన్న వాడి అపార్టుమెంటు ముందు నాటిన ఒక మిరపచెట్టు.

జీవితం పట్ల, మొక్కల పట్ల, పిల్లల పట్ల, వాడి పురాజ్ఞాపకం లాంటి గాజులపల్లె, ఆ చిన్నపల్లెలో కురువృద్ధులైనా, ఎల్లవేళలా వాడి సజీవ జ్ఞాపకంలో నిలిచిన నానమ్మా, తాతయ్యల హీరోచిత జీవన పోరాటం పట్ల తపన ఉంది. వాడు అమెరికాలో తన సహచరులకు, సహోపాధ్యాయులకు, గైడ్‌లకు చెప్పిన వాళ్ల నాన్న, ‘కాక’ల జ్ఞాపకాలు, ఊరి జ్ఞాపకాలున్నాయి. తెలుసా! కిరణ్‌ను మేము తెలుసుకోలేకపోయాం. ఒక నిరక్షరాస్యుడైన తాతకు మనవడు డెబ్భైరెండువేల మైళ్ల దూరంలో అంతటి ప్రతిభ గల వాడవుతాడని ఊహించి ఉండగలమా! కిరణ్‌ ఒక వ్యాప్తి. పూలవనంలా తన చుట్టూ వ్యాపించిన జీవన పరిమళం. కుటుంబ సంస్కారం నుంచి వచ్చిన మం దిలో పిల్లవాడు. మెదడు దాని పరిణామాలు.

మెదడు దాని సంక్షోభాలు. బ్రెయిన్‌లో ట్యూమర్‌లు, డిప్రెషన్‌ల లోకంలో, నైట్రేట్‌లు, రసాయన పరిణామాలకు మొత్తంగా మనసు సంక్షోభాల మూలాలకోసం వెతుకు లాడిన, దేవులాడిన కిరణ్‌ పరిశోధనలు, ఆ ‘ ఔట్‌లైన్‌’ చూసినప్పుడు మాకు వాడంటే అంతుబట్టలేదు. ‘మా కొడుకుని మేము అచ్చంగా తెలుసుకోలేకపోయామని ‘రాజన్న రోదిస్తున్నాడు. నిజమే… కిరణ్‌ లేడు. వాడి పరిశోధనా పూర్తి కాలేదు. కానీ,.. వాళ్ల ‘గైడ్‌’ ఇట్లా అంది. “కిరణ్‌లాంటి కలివిడి మనిషి తనకోసం కాకుండా పదిమందికోసం తపన పడిన మనిషి. అందరి కష్టసుఖాలూ పంచుకున్న మనిషి. అన్నింటికన్నా ముఖ్యంగా గొప్ప పరిశోధన ప్రపంచంలో అతి తక్కువమంది మాత్రమే చేస్తున్న పరిశోధన అది అర్థాంతరంగా ఆగిపోవడం. దుఃఖం కలిగిస్తున్నది. కిరణ్‌ను మనం పొందలేం. పోగొట్టుకున్నాం…” కిరణ్‌కు నల్లగొండలో శ్రీనివాసరెడ్డి వాళ్ల మిత్రబృందం ఉన్నారు. వాళ్లు ‘కిర ణిజం’ ఒకటి ఉందంటారు.

కిరణ్‌ ను చూడడానికి వచ్చి వాళ్లు అంతులేకుండా దుఃఖ పడడం చూసినాక కిరణ్‌ విలువ ఇంకా ఎక్కువ తెలిసింది. లూసియానా యూనివర్సిటీలో ఆ కెమిస్ట్రీ ల్యాబ్‌లో కిరణ్‌కోసం ఒక ఎర్ర కుర్చీ ఎదురుచూస్తున్నది. వాడి టేబుల్‌ మీద రెండు పుస్తకాలున్నాయి. వాడి భార్య స్వప్న కొనిచ్చిన కానుకలు. 9/11-నోమ్‌ ఛామ్‌స్కీ, ‘ఎ కన్ఫెషన్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ హిట్‌మాన్‌’ (దళారి పశ్చాత్తాపం) చేగువేరా- మోటార్‌ సైకిల్‌, డైరీస్‌, డీవీడి. అవిమాత్రమే మాకిప్పుడు మిగిలాయి. కిరణ్‌కు అమెరికా తెలుసు. నిర్వికారంగా ఉండే, సంస్క­ృతి లేని, మనిషితనం లేని, క్రూరమైన ఆర్థిక ప్రయోజనాలు గల మిడిమేళపు దేశంగా అమెరికా వాడికి బాగానే అర్థమయింది. ‘కత్రినా’ తుఫాను వచ్చినప్పుడు… ‘కాకా’ ఏం దేశం ఇది. నెలల తరబడి వందలాది మంది నల్లవాళ్ల శవాలు నీళ్లల్లో నానీనానీ.. ఇదొక ఛండాలమైన దేశం అనేవాడు. కానీ… వాడి మృత్యుదూతలూ…వారే అయితే అంతకన్నా విషాదం వాడికీ, మా కుటుంబానికీ ఏమి మిగిలి ఉంది.

కిరణ్‌… చంద్రశేఖర్‌రెడ్డి… అమెరికా లో డాలర్లు కోసుకోవడానికి వెళ్లిన వాళ్లూ కాదు, దురాశా, కోటి సంపాదనకోసమూ వెళ్లినవాళ్లూ కాదు. పరిశోధనావకాశాలు వెదుక్కొంటూ వెళ్లిన విద్యార్థులు వాళ్లు. ఒక చిన్న వినతి. మా కుటుంబం డాలర్లకోసం, కోట్లకోసం, బిల్డింగ్‌ల కోసం వెంపర్లాడినదికా దు.మేం అక్షరాన్ని నమ్ముకుని బతికిన వాళ్లం, బతుకుతున్న వా ళ్లం. అల్లం రాజయ్య, శోభారాణిలకు ఆ ఉద్దేశ్యమూలేదు. వాళ్లిప్పుడు కొడుకును పొగొట్టుకుని దుఃఖంలో ఒకే విలాపం. ఇట్లా ఎందుకయ్యింది. అవునూ… నిర్వికారంగా బాడీ బ్యాగులను స్వీకరించే అమెరికాలాంటి దేశం నుంచి ఒక పెట్టెలో వచ్చిన మా కిరణ్‌ బతికి లేడంటే నమ్మలేకుండా ఉన్నాం పుట్టెడు శోకం… మాక్సింగోర్కీ స్వర్ణ పిశాచి నగరంగా చెప్పాడు. ఏబీకే మనవడిని పోగొట్టుకుని అమెరికా క్రూరవిలాపం గురించి రాశారు.

అల్లంరాజయ్యకు, ఆయన సోదరులకు అమెరికా క్రూర స్వభా వం గురించి తెలుసు. పలకరించడానికి వచ్చినప్పుడు, కేసీఆర్‌ ఇట్లా అన్నారు. “అమెరికా స్క్వీజ్‌ చేస్తుంది”. అవును అమెరికా మా ఆనందాన్ని ‘స్క్వీజ్‌’ చేసింది. మా దుఃఖాన్ని కూడా. ‘కాకా’ అన్న పిలుపు చెవుల్లో మార్మోగుతోంది. ఇది మా ఒక్కరి దుఃఖమా! అమెరికా వెళ్తున్న పిల్లల కోసం ‘తపన పడ్తున్న’ అందరి శోకమా? ‘కాకా’…కిరణ్‌…ఈ నాలుగు వాక్యాలు రాయకుండా మరేదీ రాయలేని అచేతనలో..పుట్టెడు జ్ఞాపకాలతో కంటికి కడివెడు… …ఒకానొక డిసెంబర్‌ చలిరాత్రి వాడి కోసం గద్దర్‌ మామ య్య, వీవీ మామయ్య, నీ కాకలు, వాళ్ల దోస్తులూ ముప్పై రెం డు ఛానెళ్లూ ఎదురుచూస్తుండగా మా కిరణ్‌ మృత్యుశీతలమై ఒక పెట్టెలో పడుకుండిపోయి గడ్డకట్టిపోయి వచ్చాడు… కాకా…మళ్లీ రారా మాకోసం.. ఈ దుఃఖం… ఎవ్రీ బడీ క్రైస్‌.

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: