jump to navigation

‘నాతోని గాదు’ మార్చి 29, 2008

Posted by Telangana Media in AndhraJyothy, Pranahita.
trackback

– అల్లం నారాయణ

నిజామ్‌కు మొక్కుమంటవా !
దొరా !
నీబాంచెన్‌.
నిజాం ఏడేడు తరాలకు
దండేసి దండం పెట్టమంటవా !
ఆయనకే కాదు. తెలంగాణను పొరుకపోడుచేసిన జాగీర్దార్లు, జమీందార్లు, దేశ్‌ముఖ్‌లు, రెడ్లు, వెలమదొరలకు కూడా సాగిలపడి సలామ్‌ చెయ్యమంటవా ! ఎన్నేండ్లు మొక్కమంటవు.ఎన్నేండ్లు బాంచెగిరిచెయ్యమంటవ్‌.

  

నిజాంది.. నీదీ, నీవెనకటి జాగీర్దార్లది దొరలది ఒకే జాతి గద. దొరా ! తెలంగాణ రాకముందే మేమేందో? ఎలాన్‌ జేసినవ్‌. మంచిది. కానీ..
మావీపుల మీద బండలెత్తి, నొసట వెట్టిరాతలు రాసి గోళ్లూడ గొట్టి పన్నులు వసూలు జేసి, ఇజ్జత్‌ పజీతజేసి, రాసిరంపానబెట్టి, బరిబాత బతుకమ్మలాడిచ్చి, తల్లి సన్నుపిండి పాలు మురుక చూసిన నిజామూ, నువ్వూ, ఆరారు పదారుమంది దొరల జాతికి ఈ గులామ్‌ గిరీ ఎన్నొద్దులు చెయ్యమంటవ్‌.
ఎన్ని కాలాలు. ఎన్ని శతాబ్దాలు.
నిజాం మంచోడె. మమ్ముల్ని నిలువునా ముంచిన దొరలూ మం చోళ్లె. కని దొరా ! ఆర్ట్స్‌ కాలేజీకి రాళ్లెత్తిన కూలీలకు గిట్టిందెంత? పోగొట్టుకున్నదెంత? నిజాం కట్టిన నీటి ప్రాజెక్టుల కింద పొందిం దెంత ? పోగొట్టుకున్నదెంత ? నిజామ్‌ అట్టహాసాల, ఆడంబరాల, విలాసాలముందు వెలతెల బోయిన జీవనమెట్టిది? నిజామ్‌ వారసులయిన నీ జాతి కచ్చడాల ముందు ఉరికిన సాకలి, మంగలి ఉచ్ఛ్వాస నిశ్వాసల ఆయాసం కొలమానం ఎంత!అవమానం పాలెంత ?
తెలంగాణ అంటె ఏంది. ఒక ఒడవని కత. ఒక తెలియని చరిత. విస్మరించిన గతం, వి«ధ్వంసమయిన వర్తమానం. ఇప్పుడు నడుస్తున్న చరిత్ర నీదికాదు. మాదికాదు, నిజమే. ఒప్పుకుంట. ఆ మాట కొస్తే ఈ భూమి పుత్రుల, మూలవాసుల చరిత్రను మాయజేసి, మతుపరిచ్చిండ్రు.నిజమేనంట.
ఎవడి పులగం పడి ఈ తెలంగాణ పొందిచ్చిండో, ఎవడివేలు ఈ తెలంగాణ జాతికి దారి చూపిచ్చిం దో? ఎవరి రక్తమాంసాలు ఈ తెలంగాణ కోసం తండ్లాడినయో, చరిత్ర లేదు. ఒక తప్పుడు చరిత్ర తెలంగాణ అస్తిత్వాన్ని కబళిం చిందీ నిజమే. కానీ.. నీ బాంచెన్‌. నిజాంను ఒప్పుకొమ్మంటే ఎట్లా ఒప్పుకుంట. ప్రాణాలు తీసిన ఆ నరరూప రాక్షసుల నీలినీడలు మరచిపొమ్మంటే ఎట్లంట ? కొన్ని నెత్తుటి కాల్వలు పారిచ్చి గదా నిజాం పంటకాల్వలు పారిచ్చిండు.

కొన్ని కొనవేటి గోళ్లూడగొట్టికదా నిజాం నగిషీలు చెక్కిన ఆ భవంతులు కట్టిచ్చిండు. ఏభాషను ఉద్దరిచ్చిండని, ఏ సంస్క­ృతిని బతకనిచ్చిండని. ‘దక్కానీ’లమీద ‘లక్నోవీ’ ల పెత్త నం. తెలంగాణం మీద రాజభాష పెత్తనం. వలసపాలకుల నమ్మిన బంటుగా అటు తెల్లదొరలను, ఇటు తైనాతీలను మా మూపుల మీద నిలబెట్టికదా ఆ రాచరికపు గుంటనక్క తెలంగాణనేలిండు. అంతర్గత వలసలకు ఆయన కారణం కదా! ముల్కీలకు ముందు అంగ్రేజి నేర్చిన ఉద్యోగులను తెచ్చింది ఆ నిజాం కాదా? ఏది మూలం? తెలియదా? నిజాం రాజ్యాన్ని ముక్కల కింద ముష్కరులకు రాసిచ్చిందెవరు? వలస పాలకులకు వంగి వంగి దండాలు పెట్టి గులాం గిరీ చేసి సలామ్‌ చేసిందెవరు? చెరువులు తవ్విండు సరే ! ఆ చెరువుల కింద బండలైన బతుకులెవరివి? ఏ కాస్తు కింద, ఏ కిస్తీలకింద ఏ సర్ఫెఖాస్‌ల కింద ఎవరు రాజ్జెమేలిండు? తెలంగాణను ఎన్నేండ్లు ఎనకకు మళ్లించిన ఒక తరతరాల బూజునెట్లా తలకెత్తుకొమ్మంటవు.

నిజామ్‌ ఒకవ్యక్తికాదు గదా.. ఒక వ్యవస్థ కదా. నిజమే. త్యాగాల బాట.. తండ్లాటయ్యింది. విశాలాంధ్ర, ప్రజారాజ్యం..అంతర్గత వలసల అడ్డదారి అయింది. అస్తిత్వం వెదుకులాటలో అన్నీ సక్రమమే కావొచ్చు. అస్తిత్వం అంటే మూకుమ్మడి మూడున్నరకోట్లమంది ఉద్వేగ, ఆకాంక్షల సమాహారమూ నిజమే. మనదిగాని మన చరిత్ర. విస్మరించిన చరిత్ర వక్రీకరించిన నూరు అబద్ధాల అడ్డగోలు చరిత్ర ధిక్కరణా కావాల్సిందే. కానీ… తెలం గాణల తండ్లాడింది మేము. తెలంగాణల డొల్లాడింది మానెత్తురు. పారాడింది మామూలాలు. నిజాంనెందుకు తెస్తవు నానెత్తుటి ఆశ్వాసాల ముందుకు. తెలంగాణ ఒక నెత్తుటి పువ్వు. నిత్య పోరాటాల నవయవ్వన ఝరి. నిత్యగాయాలనది. త్యాగాల చాలు బోసిన ఒక బొడ్డుతాడు సంబంధం. గతానికీ, వర్తమానానికీ కత్తుల వంతెన కట్టిన ఓ వికసించిన విద్యుదుత్తేజం. ‘తీగలను తెంపిన’ ముసలినక్కల మీద ‘చుట్టుముట్టిన’ దండోరా ప్రతిధ్వని. నాకీ నిజామ్‌ చుట్టరికమెం దుకు.

వలసపాలనపై కోఠీలో గుండుపేల్చిన తుర్రెబాజ్‌ ఖాన్‌,ఆబిడ్స్‌ల నవాబుల రాక్షససేనపై కలం కత్తిదూసిన యోధుడు షోయబుల్లాఖాన్‌, దేశ్‌ముఖ్‌లు, జాగీర్దార్ల గల్లాపట్టి పోరాట పతాక ఎత్తి న బందగి చిందిన రక్తం, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, అంతర్గత వలస పాలనపై దండెత్తి గుండ్లకు గుండెలొడ్డిన ఎన్నం ఉపేం దర్‌ సహా 370మంది అమరవీరులు, హుస్నాబాద్‌ స్థూపం మీది పేర్లు-ఈ నెత్తుటి వారసత్వం ఒక చరిత్ర. అది తెలంగాణలో నిటారుగా నిలుచున్న మూడుస్థూపాల వారసత్వం. రేపటి తెలంగాణ పుడమితల్లి వారసత్వం. దొరా! ఇంగ నావల్ల కాదు. మేర్సె నహిహోతా. నిజామ్‌కు నేను హర్కిస్‌ మొక్కలేను. ఇగ ఇవ్వాల్టితో నీకు సాగిలపడలేము. మన్నించుదొరా. మా తెలంగాణ వేరయిపోయింది. షోయబుల్లాఖాన్‌ వారసులం,బందగి ప్రేమికులం, ఎన్నం ఉపేందర్‌ సహచరులం, పక్కా తెలంగాణవాదులం చెప్తున్నం. జరవిను.

వ్యాఖ్యలు»

1. reddy - మే 19, 2008

narayana garu
nijaani chepparu
salute to you
buchi reddy
hanamkonda@aol.com
9495108590

2. Srinivasulu - మే 30, 2008
3. ramana - ఆగస్ట్ 1, 2008

anna manchiga ippi cheppinavu
dora venuka thirige vallaku ippudaina buddi ravale

4. ramana - ఆగస్ట్ 1, 2008
5. nrahamthulla - ఆగస్ట్ 31, 2010

తుర్రేబాజ్‌ ఖాన్ ‌, బందగి , షోయబుల్లాఖాన్‌ లాంటి అనేక మంది ముస్లింలు కూడా నిజాం నిరంకుశ పాలనలో హత్యచేయబడ్డారు.1946-48 సంవత్సరాల్లో బందగి హత్య నేపధ్యాన్ని ఇతివృత్తంగా తీసుకొని సుంకర , వాసిరెడ్డి లు మాభూమి నాటకాన్ని వ్రాసి ఊరూరా ప్రదర్శనలిచ్చారు.మా భూమి నాటకం షేక్ బందగీ సమాధి దగ్గర నిలబడి నివాళులర్పించటంతో ప్రారంభమయింది.1942లో షేక్ బందగీ ని విసునూరు రామచంద్రారెడ్డి గూండాలు హత్యచేశారు.దేవులపల్లి వెంకటేశ్వరరావు 1845లోనే ‘జనగామ ప్రజల వీరోచిత పోరాటాలు’ పుస్తకం లో బందగీ గురించి వివరంగా రాశారు.తిరునగరి రామాంజనేయులు వీరబందగి పేర బుర్రకథ వ్రాసి ప్రదర్శనలిచ్చారు.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: