jump to navigation

రాజీనామాలు బాధాకరం మార్చి 5, 2008

Posted by Telangana Media in Telangana Articles.
trackback

”తెలంగాణ ఇవాళకు ఇవాళ ఇవ్వాలంటే కష్టం” అని ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. తెరాస ఎమ్మెల్యేల రాజీనామా నేపథ్యంలో శాసనసభలో జరిగిన చర్చలో పాల్గొన్న ముఖ్యమంత్రి …

రాజీనామాలు బాధాకరం
ఆమోదించొద్దు: వైఎస్‌
సీఎం ప్రసంగాన్ని అడ్డుకున్న నాగం
తెదేపా సభ్యుల సస్పెన్షన్‌
రాజీనామాలకు మావాళ్లు సిద్ధం
కాంగ్రెస్‌కు సవాలు విసిరిన బాబు
హైదరాబాద్‌ – న్యూస్‌టుడే”తెలంగాణ ఇవాళకు ఇవాళ ఇవ్వాలంటే కష్టం” అని ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. తెరాస ఎమ్మెల్యేల రాజీనామా నేపథ్యంలో శాసనసభలో జరిగిన చర్చలో పాల్గొన్న ముఖ్యమంత్రి అంతకుముందు విపక్షం చేసిన అభియోగాలకు సమాధానం ఇచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాగస్వామ్య పార్టీలు, మిగిలిన రాజకీయ పార్టీలన్నింటితో చర్చించి తెలంగాణపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు, అణు ఒప్పందం బిల్లులను తీసుకురావాలని కాంగ్రెస్‌ కృతనిశ్చయంతో ఉన్నా మిగిలిన పార్టీల మద్దతు లేకపోవడం వల్ల ఏమీ చేయలేక పోతున్నామని తెలిపారు. సీపీఎం నుంచి రాఘవులు, ఏచూరిలు ఇప్పటికీ భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజనకు అంగీకరించడం లేదన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం చాలా బాధకరమని వైఎస్‌ చెప్పారు. తెరాస వారు రాజీనామా చేస్తూ కాంగ్రెస్‌, సోనియాగాంధీ ద్రోహం చేశారని మాట్లాడడం భావ్యం కాదన్నారు. సమకాలీన రాజకీయాల్లో సోనియా కంటే విశ్వసనీయత, త్యాగ నిరతి కలిగిన నేత మరొకరు లేరని చెప్పారు. ఆమె జాతీయత గురించి మాట్లాడడం భారత జాతికే అవమానమని అన్నారు. ప్రపంచంలోనే రెండుసార్లు ప్రధాని పదవి వచ్చినా త్యాగం చేసిన ఘనత ఆమెకే సొంతమని చెప్పారు. విదర్భ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు ఆవశ్యకతను గుర్తించి, రెండో ఎస్సార్సీ అవసరమని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ 2001లో నిర్ణయం తీసుకుందన్నారు. ఇదే విషయాన్ని అప్పుడు అధికారంలో ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వానికి లేఖరాస్తే, రెండో ఎస్సార్సీ వేయడం కుదరదని అప్పటి హోంమంత్రి అద్వానీ సమాధానం ఇచ్చారని తెలిపారు. 2004 ఎన్నికల్లో తెలంగాణ ప్రజల్లో పెరుగుతున్న ఆశలు, ఆకాంక్షలను గుర్తించి, మొదటి ఎస్సార్సీని దృష్టిలో ఉంచుకుని రెండో ఎస్సార్సీ అవసరం ఉందని భావించి తెరాసతో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. ఎన్నికల పొత్తు కుదుర్చుకునే ముందు ఈ అంశాన్ని తెరాస అధినేత కేసీఆర్‌కు చదివి వినిపించిన అనంతరం ఆ పార్టీ పక్షాన నరేంద్ర సంతకం చేశారని వివరించారు. తెలంగాణ ఏర్పాటుకు కేంద్రంలో 75 పార్టీలు అంగీకరించినా, తెలుగుదేశం, భాజపాలు ఇప్పటికీ ఏమీ చెప్పలేదన్నారు. తెలంగాణపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవాలంటే కుదరదని చెప్పారు. బయటి పార్టీలే నిర్ణయాన్ని సోనియాకు వదిలేస్తే, మేం ఎలా కాదంటామని అన్నారు. తెలంగాణ భావనతోపాటు మిగిలిన అంశాలు కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి ఎలాంటి గడ్డి కరవదని అన్నారు. సిద్ధాంతాల కోసం మహాత్మాగాంధీ, ఇందిర, రాజీవ్‌ లాంటి నేతలను కోల్పోయామని వివరించారు. లౌకికవాదం కోసం దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కోరుకోబోమని తెలిపారు. అభివృద్ధి అంతా పులివెందుల, కడపలకు పరిమితం అవుతోందని అనుకోవడంలో అర్థం లేదని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రం మొత్తంమీద రూ.23 వేల కోట్లు ఖర్చు చేస్తే, తెలంగాణలో రూ.11,776 కోట్లు ఖర్చు చేశామన్నారు. రాష్ట్రంలో సమతుల్య అభివృద్ధికి కేంద్ర ఆర్థికసంఘం తరహాలో ప్రత్యేక కమిటీని నియమిస్తామని సీఎం చెప్పారు. ఈ సభలోనే దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుందామని సూచించారు. ”తెరాస సభ్యుల రాజీనామాలను ఆమోదించవద్దు. అవసరమైతే వారిని పిలిచి మరోసారి అడగండి. సభ తరఫున మరోసారి అభ్యర్థిస్తున్నా. రాజీనామాలు ఉపసంహరించుకోండి. కలిసి పనిచేద్దాం. సమతుల్య అభివృద్ధి సాధిద్దాం” అని వైఎస్‌ పిలుపునిచ్చారు. తెదే సభ్యుల సస్పెన్షన్‌
తెలుగుదేశం సభ్యుడు నాగం జనార్దన్‌రెడ్డి ముఖ్యమంత్రి ప్రసంగాన్ని మధ్యలో అడ్డుకున్నారు. తనపై చేసిన ఆరోపణలకు వివరణ ఇచ్చుకొనేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సభాపతి అనుమతించక పోవడంతో తెలుగుదేశం సభ్యులు ఆయనకు మద్దతుగా లేచారు. అవకాశం కోసం పట్టుపట్టారు. సభ సజావుగా జరగడానికి నాగంను ఒకరోజు సభ నుంచి సస్పెండ్‌ చేయాలని రోశయ్య ప్రతిపాదించారు. సభాపతి ఆమోదించారు. దీనికి నిరసనగా తెలుగుదేశం సభ్యులు నిరసన వ్యక్తంచేశారు. పాలకపక్ష వైఖరిపై తెలుగుదేశం సభ్యులు నినాదాలు చేశారు. సభాపతి విజ్ఞప్తులు ఫలించక పోవడంతో తెలుగుదేశం సభ్యులందరినీ సభ నుంచి ఒక రోజు పాటు సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రజాస్వామ్య విధానాలను తుంగలోతొక్కి కాంగ్రెస్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ తెలుగుదేశం సభ్యులు నినాదాలు చేశారు. మార్షల్స్‌ రంగప్రవేశం చేసి, వారిని బయటకు తీసుకువెళ్లారు.

అధికారం కోసం ఎంతకైనా…: బాబు
ముఖ్యమంత్రి కన్నా ముందు ప్రసంగించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు… దేశంలో, రాష్ట్రంలో సంక్షోభాలకు కాంగ్రెస్‌ పార్టీదే బాధ్యతని ఆరోపించారు. అధికారం కోసం ఎన్ని అరాచకాలు చేయడానికైనా వెనుకాడరని వ్యాఖ్యానించారు. ‘తెలంగాణలో ఏ మండలానికైనా వెళదాం. మీరు, మేం ఏంచేశామో చర్చకు రావాలి’ అని సవాలు విసిరారు. ప్రపంచంలోనే హైదరాబాద్‌కు ఒక గుర్తుంపు తమ ప్రభుత్వ హయాంలోనే వచ్చిందని చెప్పారు. గతంలో ఎన్టీఆర్‌ను ఎదుర్కోలేక కాంగ్రెస్‌ రాయలసీమ ప్రాంతీయ ఉద్యమాన్ని తీసుకువచ్చిందని చెప్పారు. అధికారం కోసం ప్రాంతీయ, మత విద్వేషాలను రెచ్చగొట్టిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకే సొంతమని అన్నారు. ”ప్రధానిపై చెప్పులు వేయించారు. చెన్నారెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కడప నుంచి మనుషులను తీసుకువచ్చి మత కల్లోలాలు సృష్టించారు. అధికారం కోసం ఏమైనా చేస్తారనడానికి ఇవే ఉదాహరణలు” అని చెప్పారు. తెలుగుదేశాన్ని నేరుగా ఢీకొనే ధైర్యంలేక కమ్యూనిస్టులు, నక్సల్స్‌తోనూ పొత్తుపెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశారని ఆరోపించారు. తరవాత అందరినీ మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదేనని దుయ్యబట్టారు. ”ధైర్యం ఉంటే ఇప్పుడే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లండి. మా వాళ్లు చెబుతున్నారు కదా. గెలిచి వస్తే అంగీకరిస్తాం” అని కాంగ్రెస్‌కు సవాలు విసిరారు. దీంతో పాలక, ప్రతిపక్షాల మధ్య కొద్దిసేపు వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. సభాపతి జోక్యంతో 10 నిమిషాల అనంతరం తిరిగి సభ మొదలైంది. చంద్రబాబు ప్రసంగం కొనసాగించారు. సంపద సృష్టించడానికి పునాదులు వేసింది తెలుగుదేశం ప్రభుత్వమే అన్నది గుర్తుంచుకోవాలన్నారు. పేదల నుంచి భూములు తీసుకుని కోట్ల రూపాయలకు బడా సంస్థలకు అప్పగిస్తున్నారని విమర్శించారు. ”అభివృద్ధి అంటే పులివెందుల కాదు. ఓబుళాపురం ఒక పెద్ద దోపిడీ. అధికారం కోసం ఏమైనా చేస్తారు. కులాలు, మతాలు, ప్రాంతాల పేరిట నాటకాలు ఆడుతున్నారు” అంటూ ముఖ్యమంత్రి విధానాలను తీవ్రంగా విమర్శించారు.

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

వ్యాఖ్యానించండి